నేడే గ్రేటర్‌ పోరు

1 Dec, 2020 04:30 IST|Sakshi
సోమవారం రాజేంద్రనగర్‌లో బ్యాలెట్‌ బాక్సులు పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తున్న దృశ్యం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 150 డివిజన్లలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళలు, 676 మంది ఇతరులు కలిపి మొత్తం 74,44,260 మంది ఓటర్లున్నారు.
-సాక్షి, హైదరాబాద్‌:

పోలింగ్‌కు సర్వం సిద్ధం..
పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సి.పార్థసారథి ప్రకటించారు. సోమవారం రాత్రి కల్లా పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సరంజామాతో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ సిబ్బంది కలిపి మొత్తం 48 వేల మంది పోలింగ్‌ విధుల్లో పాల్గొంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీవీ ప్యాట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఈవీఎంలకు బదులు పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. 9,101 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,277 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ సదుపాయం కల్పించారు.

ఎన్నికల్లో 28,683 బ్యాలెట్‌ పెట్టె్టలను సిద్ధంగా చేయగా, 81,88,686 బ్యాలెట్‌ పత్రాలను ముద్రించారు. బల్దియా ఎన్నికలు కావడంతో తెలుపు రంగు బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారు. బ్యాలెట్‌ పత్రాలపై నోటా చిహ్నాన్ని సైతం ముద్రించడం విశేషం. 2,831 మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. ఇందులో దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులతో పాటు 260 మంది కరోనా బాధితులు కూడా ఉన్నారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ పెట్టె్టలను ఎన్నికల సిబ్బంది పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్‌ రూంలకు తరలించనున్నారు.
ఇందుకోసం 150 స్ట్రాంగ్‌ రూంలను నగరంలో ఏర్పాటు చేశారు. 

డిసెంబర్‌ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, సెలవు ప్రకటించిన ప్రభుత్వం..
ఇక ఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, దుకాణాలు, ఇతర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ ఓటర్లు జీహెచ్‌ఎంసీ వెలుపలి ప్రాంతాల్లో పనిచేస్తుంటే, ఓటేసేందుకు అవకాశం కల్పించేలా వారి పనివేళల్లో కొంత రిలీఫ్‌ కల్పించాలని పరిశ్రమలు, ఇతర సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. 

ఆ పార్టీలకు ప్రతిష్టాత్మకం..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలు బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ నుంచి కొంత పోటీని ఎదుర్కొంటోంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్‌ఎస్‌.. రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి ఈసారి సైతం గణనీయ సంఖ్యలో సీట్లను గెలవాలనుకుంటోంది. ఇటు పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం.. గత ఎన్నికల్లో గెలిచిన 44 స్థానాలను నిలుపుకునే దానిపై ధీమాతో ఉంది. ఇటు గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 68 డివిజన్లకు గాను కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల విజయంతో సమరోత్సాహంలో ఉంది.

ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుచుకుని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బలపడాలని భావిస్తోంది. ఇటు బల్దియా ఎన్నికల్లో తాము సైతం గట్టి పోటీ ఇచ్చి చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం పేర్కొంటోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం రెండు డివిజన్లలో మాత్రమే గెలవగా, రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఈ ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి. గత ఎన్నికల్లో 82 డివిజన్లలో పోటీ చేసిన టీడీపీ కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలవగా, ఈ సారి కూడా పోటీలో ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల భవితవ్యంపై నగర ఓటర్లు కీలక తీర్పు ఇవ్వబోతున్నారు. డిసెంబర్‌ 4న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. 

ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి 10 కరోనా కిట్లను, ఐదు శానిటైజర్ల సీసాలను సరఫరా చేశారు. ఓటర్లు క్యూలలో నిలబడేలా వృత్తాకారపు పరిధులు గీశారు. కరోనా నిర్ధారణ, అనుమానిత వ్యక్తులకు సైతం ఓటు హక్కు కల్పించేందుకు పోలింగ్‌ సమయాన్ని గంట పెంచారు.

గత ఎన్నికల్లో ఇలా...
గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం 74,24,096 ఓట్లకు 33,62,688 (45.29 శాతం) ఓట్లు పోలయ్యాయి. అందులో నోటాకు పోలైన ఓట్లు పోగా అభ్యర్థులు, స్వతంత్రులకు కలిపి 33,49,379 ఓట్లు లభించాయి.
పోలైన ఓట్లలో టీఆర్‌ఎస్‌ అత్యధికంగా 14,68,618 (43.85 శాతం) ఓట్లను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఎంఐఎం 5,30,812 (15.85 శాతం) ఓట్లను దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. టీడీపీ 4,39,047 (13.11 శాతం), కాంగ్రెస్‌ 3,48,388 (10.40 శాతం), బీజేపీ 3,46,253(10.34 శాతం) ఓట్లను సాధించాయి. ఇటు సీపీఐ 12,748 ఓట్లు, సీపీఎం 8,538, బీఎస్పీ 10,478, లోక్‌సత్తా 10,385, ఇతర రిజిస్టర్డ్‌ పార్టీలు 28,765, స్వతంత్ర అభ్యర్థులు 1,46,481 ఓట్లను దక్కించుకోగలిగారు. 

మరిన్ని వార్తలు