మీకు ఓట్లడిగే హక్కు లేదు..

23 Nov, 2020 03:29 IST|Sakshi

టీఆర్‌ఎస్, బీజేపీలపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ధ్వజం

కరోనాతో జనం చస్తుంటే కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడు..

హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే.. 

సాక్షి, హైదరాబాద్ ‌: టీఆర్‌ఎస్, బీజేపీలకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యా నించారు. గత ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదని, కేంద్రం నుంచి ఒక్క రూపాయి నిధులు కూడా బీజేపీ నేతలు తేలేదని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందిందీ, విశ్వనగరమైందీ కాంగ్రెస్‌ హయాంలోనేనని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఆదివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్‌లతో కలసి ఆయన మాట్లాడారు. మెట్రో రైలు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే లాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జంట నగరాలకు కృష్ణా జలాలు తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేనని ప్రజలు గమనించాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.67 వేల కోట్ల అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్‌ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు.

పరిహారాన్ని పందికొక్కుల్లా మేశారు..
కరోనాతో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడని, కనీసం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో కూడా చేర్చలేదని ఉత్తమ్‌ విమర్శించారు. 100 ఏళ్ల తర్వాత పెద్ద ఎత్తున వరదలు వస్తే ప్రజలను ఆదుకోవాల్సింది పోయి బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని కూడా పందికొక్కుల్లా మేసిన ఘనత టీఆర్‌ఎస్‌ నాయకులదని ఎద్దేవా చేశారు. గత ఆరేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్‌కు రూపాయి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు.

అభివృద్ధి నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ మంజూరు చేసిన ఐటీ రీజియన్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దు చేస్తే కనీసం ఒక్క మాట కూడా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, అన్ని విషయాల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వత్తాసు పలికిందని విమర్శించారు. ఎంఐఎం కూడా టీఆర్‌ఎస్‌ కనుసన్నల్లో బీజేపీకి లబ్ధి జరిగే విధంగా వ్యవహరించిందని చెప్పారు. అందుకే ఆ పార్టీలను ఓడించి కాంగ్రెస్‌ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని, తాము గెలిస్తే హైదరాబాద్‌ సుస్థిర అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.

వారం పాటు అప్రమత్తంగా ఉండాలి..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్‌ పక్షపాతం లేకుండా వ్యవహరించాలని ఉత్తమ్‌ కోరారు. మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోలకు మాత్రం ఎల్‌ఈడీ లైట్లతో ప్రచారానికి అనుమతినిచ్చిన ఈసీ.. తామడిగినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని, ఈ వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండి ఎన్నికలను ఎదుర్కోవాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. 

ప్రభుత్వ హోర్డింగులు తొలగించరా? : పొన్నం
ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన హోర్డింగులతో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాము ఎన్నికల కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా ఇంతవరకు ప్రభుత్వ హోర్డింగులను తొలగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హోర్డింగులు తొలగించడానికి ఎందుకు ఆదేశాలివ్వడం లేదని, ఈసీ వాటిని తొలగించకపోతే తమ కార్యకర్తలు తొలగిస్తారని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా తాము వ్యవహరించబోమని, ఈసీ మాత్రం ఎన్నికల నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.

మరిన్ని వార్తలు