మోగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా!

17 Nov, 2020 08:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నగారా మోగనుంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి ప్రకటించారు. డిసెంబర్‌ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్‌ 1న ఓటింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌ చేపట్టే దిశగా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముంది. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రి ముగియనుంది. బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ జీహెచ్‌ఎంసీ పరిధిలో 74 లక్షల 4 వేల మందికి పైగా ఓటర్లున్నారు. అత్యధికంగా మైలార్‌దేవ్‌పల్లిలో 79,290 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా రామచంద్రాపురంలో 27,997 మంది ఓటర్లున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న డివిజన్‌గా బన్సీలాల్‌పేట్‌. ఇక గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.

ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే నగరవాసులకు ఆస్తి పన్నులో మినహాయింపు, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు వంటి తాయిలాలు ప్రకటించింది. ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. రూ.10 వేల చొప్పున వరద సాయం అందించింది. అయితే, దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ చేతిలో పరాభవం ఎదువడంతో కారు పార్టీలో కొంత కలవరం మొదలైంది. పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు శాయశక్తులా శ్రమించినా విజయం దక్కలేదు. దీంతో కారు పార్టీ మరింత అప్రమత్తమైంది. బల్దియా ఎన్నికల్లో 17 మంది మంత్రులను ఇంచార్చిలుగా టీఆర్‌ఎస్‌ నియమించనుంది. ఒక్కో డివిజన్‌కు ఒక్కో ఎమ్మెల్యేను బాధ్యుడిగా చేయనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మంత్రి కేటీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు దుబ్బాకలో సంచలనం విజయం సాధించిన బీజేపీ గ్రేటర్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ శ్రేణులు పోటీకి తయారవుతున్నాయి.
(చదవండి: టీఆర్‌ఎస్‌లో 16, ఎంఐఎంలో 13 మంది నేరచరితులు)

మరిన్ని వార్తలు