వాళ్లడిగితే.. ఆలోచిస్తాం

6 Dec, 2020 02:42 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ ఇంకా మమ్మల్ని సంప్రదించ లేదు

మద్దతు అడిగితే పార్టీలో చర్చించి నిర్ణయిస్తాం 

మేయర్‌ ఎన్నికలో ఎంఐఎం వైఖరిపై అసదుద్దీన్‌ 

బీజేపీది బలం అనుకోవటం లేదు 

తాత్కాలిక పరిస్థితులతో గ్రేటర్‌లో ఎక్కువ స్థానాలు గెలిచింది 

టీఆర్‌ఎస్‌ భయపడాల్సింది లేదు 

దక్షిణ భారత్‌లోనే కేసీఆర్‌ ప్రధాన నేత.. ఆయన వెంటే తెలంగాణ 

‘సాక్షి’తో మజ్లిస్‌ అధినేత  

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవస రంలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. టీఆర్‌ఎస్‌ తమ
మద్దతు కోరితే అప్పుడు ఆలోచిస్తామని, ప్రస్తుతానికైతే ఈ పార్టీ నుంచి తమనెవరూ సంప్రదించలేదన్నా రు. ‘బీజేపీది బలం అని నేను అనుకోవటం లేదు. బండి సంజయ్‌ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న
కరీంనగర్‌లో మేయర్, డిప్యూటీ మేయర్‌లుగా బీజేపీ వారిని గెలిపించుకోలేకపోయారు. మరో ఎంపీ అరవింద్‌ నిజామాబాద్‌లో ఇలాగే విఫలమయ్యారు. కొన్ని తాత్కాలిక పరి స్థితుల ప్రభావంతో ఇక్కడ
బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది. దక్షిణ భారత్‌లో సత్తా ఉన్న నేతల్లో కేసీఆర్‌ ఒకరు. భవిష్యత్తులోనూ తెలంగాణ జనం ఆయనకు అనుకూలంగా ఉంటారనే విశ్వ సిస్తున్నా’ అని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ
పేర్కొన్నారు. శనివా రం సాయం త్రం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాజా పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

మిగిలిన ఏడు కూడా నెగ్గుతామనుకున్నాం 
మేం ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 51 డివిజన్లలో పోటీచేసి 44 గెలిచాం. అన్ని చోట్లా నెగ్గుతామని ఆశించాం. కానీ మా అభ్యర్థులు కొందరు సరిగా పనిచేయలేకపోవటం వల్ల మిగతా వాటిని
సాధించలేకపోయాం. దీనిపై కూడా అంతర్గతంగా విశ్లేషించుకుని పొరపాట్లు సరిదిద్దుకుంటాం.  

బీజేపీకి భయపడం... 
ఎప్పుడూ ప్రజల్లో ఉండి, వారి సమస్యలు పరిష్కరిస్తూ.. వారికి దగ్గరవుతుండటమే మా విజ యరహస్యం. ఇక ముందూ అలాగే ఉంటాం. బీజేపీ ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలిచినంత మాత్రాన ఆ పార్టీతో మాకు
పోటీ ఏం లేదు. మాకు పట్టున్న చోట పనిచేసుకుంటూ పోతాం. ఎన్నికల్లో ఎవరిని ఆదరించాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. బీజేపీని చూసి మేం భయపడం. టీఆర్‌ఎస్‌ కూడా భయపడొద్దనే సూచిస్తున్నా.
 
ఎవరికీ అనుకూల తీర్చు ఇవ్వలేదు 
తాజా ఎన్నికల్లో హైదరాబాద్‌ నగర ఓటరు మూడు పార్టీలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్టుగానే అనిపిస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీ, మా పార్టీ... దేనికీ పూర్తి అనుకూల తీర్పు చెప్పలేదు. ఇది కొంత ఇబ్బందికర
విషయమే. అలా ఎందుకు జరిగిందో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.  

పార్టీలో అంతర్గతంగా చర్చిస్తాం 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడై 2 రోజులు కూడా గడవలేదు. అప్పుడే మేయర్‌ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సినంత హడావుడి లేదు. నేరేడ్‌మెట్‌ ఫలితం పెండింగ్‌లో ఉంది. అది వచ్చాక మేయర్‌
ఎన్నికపై అంతర్గతంగా పార్టీలో చర్చించి ఓ అభిప్రాయానికి వస్తాం. 

టీఆర్‌ఎస్‌ సంప్రదించలేదు 
మా ఫలితాలను విశ్లేషించుకునే పనిలో ఉన్నాం. మేయర్‌ విషయంలో టీఆర్‌ఎస్‌ మా మద్దతు కోరితే అప్పుడు ఆలోచిస్తాం. ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. మా అవసరం
ఏర్పడి సహకారం కోరితే .. మా పార్టీ నేతల అభిప్రాయానికనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం.

దుబ్బాకతో గ్రేటర్‌కు పోలిక లేదు 
ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలవటానికి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువ సీట్లు సాధించటానికి పోలిక లేదు. టీఆర్‌ఎస్‌ చేసిన కొన్ని తప్పిదాల వల్ల దుబ్బాక ఫలితం అలా
వచ్చింది. దివంగత ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం, ప్రచార సమయంలో బీజేపీ అభ్యర్థి ఇంటిలో సోదాల పేరుతో హడావుడి చేయటం, పోలింగ్‌కు మూడు నెలల సమయం దొరికినా టీఆర్‌ఎస్‌
దాన్ని సరిగా వినియోగించుకోలేకపోవటం... ఇలాంటి కారణాలతో టీఆర్‌ఎస్‌ ఓడిందని నేను అనుకుంటున్నా.  

>
మరిన్ని వార్తలు