దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ.. గులాం నబీ ఆజాద్ పార్టీ పేరు ఇదే..

26 Sep, 2022 12:45 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ మాజీ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ కొత్త పార్టీని స్థాపిస్తానని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరును ఆయన సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉర్దూ, సంస్కృతంలో  దాదాపు 1500 పేర్లు పరిశీలించామని చెప్పారు. హిందూ, ఉర్దూ రెండూ కలిపితే హిందూస్థానీ అన్నారు.

ప్రజాస్వామ్యం, శాంతి, స్వాత్రంత్ర్యాన్ని  ప్రతిబించేలా పార్టీ పేరు ఉండాలనుకున్నామని ఆజాద్‌ చెప్పారు. అందుకే చివరగా 'డెమొక్రటిక్ ఆజాద్‌ పార్టీ' పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ పార్టీ జెండా నిలువుగా మూడు రంగుల్లో ఉంది. నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికలో తీర్చిదిద్దారు. కశ్మీర్ ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ ఎజెండా అని ఆజాద్ అన్నారు.  ప్రస్తుతం తన పార్టీ జమ్ముకశ్మీర్‌కే పరిమితం అవుతుందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించే విషయంపై ఆలోచిస్తానని ఆజాద్ ఇప్పటికే చెప్పారు.

కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధానికి తెగదెంపులు చేసుకొని గత నెలలోనే పార్టీకి రాజీనామా చేశారు ఆజాద్. హస్తం పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2017లో రాహుల్  గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక పార్టీలో సంప్రదింపుల ఆనవాయితీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు వైద్యుడు చికిత్స అందిచాల్సింది పోయి కాంపౌడర్లు చికిత్స చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
చదవండి: రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ సమీక్ష.. హుటాహుటిన ఢిల్లీకి వేణుగోపాల్‌

మరిన్ని వార్తలు