రాజీనామా తర్వాత తొలిసారి మీడియాతో ఆజాద్‌.. అందుకే కాంగ్రెస్‌ను వీడానంటూ..

29 Aug, 2022 13:22 IST|Sakshi

న్యూఢిల్లీ: తాను కాంగ్రెస్‌ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని గులాం నబీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు. తను అవసరం లేదని కాంగ్రెస్‌ అనుకుందని, అందుకే పార్టీని బలవంతంగా వీడాల్సి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం తొలిసారి ఆయన నివాసం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ జీ-23  గ్రూప్‌లో చేరినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి తనతో సమస్య ఏర్పడిందని అన్నారు.

తాను మోదీ ఏజెంట్‌ కాదని గులాం నబీ ఆజాద్‌ స్పష్టం చేశారు. లోక్‌సభలో మోదీని కౌగిలించుకున్నది రాహులా? నేనా అని ప్రశ్నించారు. మోదీ తన గురించి రాజ్యసభలో చెప్పలేదని,  కశ్మీర్‌లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పారని ప్రస్తావించారు. కాగా అయిదు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన అగ్రనేత గులాం నబీ ఆజాద్‌ చివరికి ఆపార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ రెబల్‌గా మారారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌ దిగ్గజ నేతల్లో ఒకరిగా పేరొందిన ఆజాద్‌.. శుక్రవారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.
చదవండి: పన్నీరు ఆకర్షణ మంత్రం!.. చిన్నమ్మతో కలిసి వ్యూహం అమలు? 

రాజీనామా అనంతరం.. రాహుల్‌ గాంధీకి పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరిస్థితులు మరింత దిగజారాయని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పతనానికి రాహుల్ గాంధే కారణమంటూ 5 పేజీల లేఖను సమర్పించాడు. రాహుల్‌ గాంధీ తీరు వల్లే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే పార్టీని నుంచి బయటకు వచ్చాక ఏ పార్టీలో చేరనని, సొంతంగా పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అంతేగాక కొత్త పార్టీని ప్రారంభించిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలను ఆజాద్‌ ఖండించారు.

మరిన్ని వార్తలు