‘కాంగ్రెస్‌ ట్వీట్లు, ఎస్‌ఎంఎస్‌లతో ఏర్పడలేదు.. రక్తం ధారపోసి నిర్మించాం’

4 Sep, 2022 15:11 IST|Sakshi

సాక్షి, జమ్మూ:  కాంగ్రెస్‌ పార్టీకి తన రక్తం ధారపోస్తే పార్టీ తనను విస్మరించిందని ఆరోపించారు జమ్ముకశ్మీర్‌ నేత గులాం నబీ ఆజాద్‌. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత తొలిసారి జమ్మూలోని సైనిక్ ఫామ్స్‌లో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న దాదాపు 20,000 మంది మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మా కృషితో కాంగ్రెస్‌ ఏర్పడిందిగానీ.. ట్వీట్స్‌, ఎస్‌ఎంఎస్‌లతో కాదని ఎద్దేవా చేశారు. 

‘కాంగ్రెస్‌ పార్టీని మేము రక్తం ధారపోసి నిర్మించాం. కానీ, కంప్యూటర్లు, ట్విట్టర్‌ ద్వారా ఏర్పాటు కాలేదు. కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ, వారి పరిధి కంప్యూటర్లు, ట్వీట్లకే పరిమితం. దాంతోనే కాంగ్రెస్‌ ప్రస్తుతం అట‍్టడుగు స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన వారు బస్సుల్లో జైలుకు వెళ్తున్నారు. వారు డీజీపీ, కమిషనర్‌లకు కాల్‌ చేసి గంటల్లోనే బయటకు వస్తున్నారు. ఆ కారణంగానే కాంగ్రెస్‌ పుంజుకోలేకపోతోంది.’ అని ఆరోపించారు ఆజాద్‌. 

సొంత పార్టీపై క్లారిటీ.. 
సొంతపార్టీ ఏర్పాటుపై పలు విషయాలు వెల్లడించారు ఆజాద్‌. తమ పార్టీ జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, భూమి హక్కులు,  స్థానికులకు ఉద్యోగాలు తీసురావడం కోసం పోరాడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు పార్టీ పేరును నిర్ణయంచలేదన్నారు. జమ్ముకశ్మీర్‌ ప్రజలే పార్టీ పేరు, జెండాను నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా పార్టీకి హిందుస్థానీ పేరు పెడతానని తెలిపారు. 

ఇటీవల గులాం నబీ ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి జమ్ముకశ్మీర్‌ కాంగ్రెస్‌లో రాజీనామాలు మొదలయ్యాయి. రాష్ట్ర పార్టీ నేతలు తారా చంద్‌, అబ్దుల్‌ మజిద్‌ వనీ, మనోహర్‌ లాల్‌ శర్మ,ఘరు రామ్‌, బల్వాన్‌ సింగ్‌ వంటి ఆజాద్‌ పక్షాన నిలిచారు. శనివారం పార్టీ నేత అశోక్‌ శర్మ కూడా తన రాజీనామా పత్రాన్ని సోనియాగాంధీకి పంపారు. ఆయన కూడా గులాం నబీ ఆజాద్‌ పార్టీలో చేరనున్నారు.

ఇదీ చదవండి: రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ మెగా ర్యాలీ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై రాహుల్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు