కాంగ్రెస్‌పై తేల్చిపడేసిన గులాం నబీ ఆజాద్‌

28 Aug, 2020 10:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్గత విభేదాలతో ఇబ్బందుల్లో పడిన కురువృద్ధ పార్టీ కాంగ్రెస్‌లో మార్పులు జరగాల్సిందేనని సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగకుంటే మరో 50 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికైన కమిటీలే లేవని గుర్తు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక జరగాలని ఈ సందర్భంగా ఆజాద్‌ స్పష్టం చేశారు. కాగా, పార్టీ నాయకత్వంలో మార్పు అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్‌ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
(చదవండి: ఇది దురదృష్టకరం: కపిల్‌ సిబల్‌)

వీరిలో గులాం నబీ ఆజాద్‌ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత సోమవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. సీనియర్ల లేఖపై రాహల్‌‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో గులాం నబీ ఆజాద్‌, కపిల్‌ సిబల్‌ వంటి వారు రాహుల్‌ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ భేటీ దాదాపు ఏడు గంటలపాటు సాగింది. చివరకు అందరు నేతలు ఒకేమాటపైకి రావడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది. దాంతో ఏఐసీసీ సమావేశం నిర్వహణకు పరిస్థితులు అనుకూలించేదాకా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియా గాంధీని కోరుతూ సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. (చదవండి: గాంధీలదే కాంగ్రెస్‌..!)

మరిన్ని వార్తలు