కొందరు కావాలనే అలా చేశారు: గులాం నబీ ఆజాద్‌

26 Jan, 2022 16:42 IST|Sakshi

నాపై దుష్ప్రచారాలు చేస్తున్నారు

ట్విటర్‌ ప్రొఫైల్‌ మార్చలేదు

న్యూఢిల్లీ: దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ ప్రకటించిన తర్వాత తన ట్విటర్‌ ప్రొఫైల్‌ మార్చినట్టు వచ్చినట్టు వార్తలపై కాంగ్రెస్ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని.. తనపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

‘గందరగోళం సృష్టించేందుకు కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు. నా ట్విటర్ ప్రొఫైల్‌ నుంచి ఎటువంటి సమాచారం తీసివేయలేదు. అలాగే కొత్తగా ఎటువంటివి జోడించలేదు. నా ట్విటర్ ప్రొఫైల్ మునుపటిలానే ఉంద'ని గులాం నబీ ఆజాద్  ట్వీట్ చేశారు.

కాంగ్రెస్‌ అసంతృప్త నేతల బృందమైన జీ –23లో కీలక నాయకుడిగా ఉన్న ఆజాద్‌ అధికార బీజేపీతో సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంపీగా ఆజాద్‌ పదవీ విరమణ సమయంలో రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆజాద్‌ పరస్పరం ప్రశంసించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆజాద్‌కు పద్మభూషణ్‌ పురస్కారం దక్కడంపై కాంగ్రెస్‌ నాయకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమమైంది. కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటివరకు స్పందించకుండా మౌనంగా ఉంది. కపిల్‌ సిబల్‌, శశి థరూర్‌, రాజ్‌బబ్బర్‌ వంటి నాయకులు ఆజాద్‌కు అభినందనలు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ మాత్రం భిన్నంగా స్పందించారు. పద్మ పురస్కారాన్ని తిరస్కరించాలనే అర్థం వచ్చేట్టుగా వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ఆయన గులాంగా ఉండాలనుకోవడం లేదు)

మరిన్ని వార్తలు