జీవో111 పరిధిలో సీఎం సంబంధీకుల భూములు 

13 Apr, 2022 10:17 IST|Sakshi

అందుకే రద్దు చేశారన్న మాజీ ఎంపీ కొండా

సాక్షి, హైదరాబాద్‌: జీవో111 పరిధిలోని భూములను సీఎం సంబంధీకులు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందినవారు కొనుగోలు చేయడం వల్లే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను ఎత్తేసిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే దాదాపు 25 వేల ఎకరాలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. 2014 తర్వాత ఈ పరిధిలో భూములు కొనుగోలు చేసిన ప్రాంతాలను గ్రీన్‌జోన్లుగా ప్రకటించాలని, అంతకుముందు నుంచి భూములున్న వారిని గ్రీన్‌జోన్‌ పరిధిలోకి తీసుకురావొద్దని అన్నారు. ఈ ప్రాంతాన్ని ‘సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ జోన్‌’గా మార్చాలని డిమాండ్‌ చేశారు.

జీవో 111ను ఎత్తేస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణ యం నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ సాగులో ఉన్న కూరగాయలు, వరి ఇతర పంటలకు వాడుతున్న పురుగు, కలుపు నివారణ మందులతోనే కాలుష్యం వ్యాపిస్తోందన్నారు. అందుకే అతి తక్కువ కాలుష్యాన్ని వ్యాప్తి చేసే పరిశ్రమలు పెట్టాలని తాను సూచించినట్లు గుర్తు చేశారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జంట జలాశయాల్లో కాలుష్యాలు చేరకుండా ఇచ్చిన జీవో 111కు, పర్యావరణ పరిరక్షణకు పెద్దగా సంబంధం లేదని, 11కి.మీనుంచి అనేక కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. 1974లో అప్పటి కేంద్రం తెచ్చిన ‘సెంట్రల్‌ వాటర్‌యాక్ట్‌’ను వికారాబాద్‌ దాకా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు