ఒట్టేసి చెబుతున్నాం.. పార్టీ మారబోం

5 Feb, 2022 13:49 IST|Sakshi

గోవా కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రతిజ్ఞ

రాహుల్‌ సమక్షంలో కార్యక్రమం

పనాజి: గోవా రాజకీయాలంటేనే ఫిరాయింపులకు పెట్టింది పేరు. 40 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి కండువాలు మార్చేస్తూ ఉంటారు. దాంతో ప్రభుత్వాలు ఎప్పుడు పడిపోతాయో చెప్పలేం.  ఈ దెబ్బకు సీఎంగా ఎవరున్నా నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఈ ఫిరాయింపుల సంస్కృతికి ఇక స్వస్తి చెప్పాలంటూ కాంగ్రెస్‌ నినదిస్తోంది. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఈ విషయంలో కొత్త సంప్రదాయానికి తెర తీశారు.  

పార్టీకి విధేయులుగా ఉంటామంటూ కాంగ్రెస్‌ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. 37 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు, భాగస్వామ్య పక్షమైన గోవా ఫార్వార్డ్‌ పార్టీ (జీఎఫ్‌పీ)కి చెందిన ముగ్గురు శుక్రవారం రాహుల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ సమక్షంలో ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. గెలిచాక పార్టీ ఫిరాయించబోమని ముక్తకంఠంతో చెప్పారు. పార్టీ మారబోమని వీరంతా ఇప్పటికే ఆలయం, చర్చి, మసీదుల్లో ఒట్టు వేశారు.

ఇప్పుడు రాహుల్‌ ముందూ ప్రతిజ్ఞ చేసి ఆ మేరకు ఆయనకు విధేయతా పత్రం సమర్పించారు. ఈసారి కాంగ్రెస్, జీఎఫ్‌పీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, అందుకు అన్నివిధాలా సహకరిస్తామని అందులో పేర్కొన్నారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 సీట్లు గెలిచినా ఏకంగా 15 మంది బీజేపీలోకి ఫిరాయించారు. దీంతో ఈసారి రాహుల్‌ ఇలా అభ్యర్థులతో ముందే ప్రమాణం చేయించుకున్నారు.

మరిన్ని వార్తలు