ప్రజలు లాభపడటం టీఆర్‌ఎస్‌ సర్కారుకు ఇష్టంలేదు: ప్రమోద్‌ సావంత్‌

13 May, 2022 05:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మోదీ ప్రభుత్వ పథకాల అమలు ద్వారా తెలంగాణ ప్రజలకు లాభం చేకూరడం టీఆర్‌ఎస్‌ సర్కారుకు ఇష్టం లేదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ అన్నారు. అందువల్లే కేంద్ర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యేలా వచ్చే ఎన్నికల్లో డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురాబోతున్నారన్నారు.

గురువారం బీజేపీ కార్యాలయంలో సావంత్‌ విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. ఈ నెల 14న పాదయాత్ర ముగింపు సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రజలకు స్పష్టమైన సందేశం ఇస్తారని పేర్కొన్నారు.

డబుల్‌ ఇంజన్‌ సర్కారు అంటే ఏమిటో గోవా వచ్చి చూడాలన్నారు. ‘తెలంగాణ కంటే ఎక్కువ పథకాలను ప్రజలకు అందజేస్తున్నాం. సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు చేరేలా కృషి చేస్తున్నాం. పంచాయతీ స్థాయిలో గెజిటెడ్‌ అధికారులు ప్రతివారం పర్యటిస్తున్నారు. వందశాతం కోవిడ్‌ వాక్సిన్లు ఇచ్చిన మొదటి రాష్ట్రం గోవా. తెలంగాణలో కూడా డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలి. గోవాలో వితంతు పెన్షన్‌ ఇస్తున్నాం, కల్యాణ లక్ష్మి మా దగ్గర కూడా ఉంది. రూ.లక్ష ఇస్తున్నాం. రైతులకు, పాడి రైతులకు లక్షా ముప్పై వేల రుణం.. 40 శాతం బోనస్‌ కూడా ఇస్తున్నాం’అని సావంత్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు