చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?

4 Nov, 2021 06:22 IST|Sakshi

అయిదు నెలలు గడువు ఉన్నా రాజుకున్న ఎలక్షన్‌ హీట్‌  

బీజేపీలో మనోహరంగా వెలిగిపోయిన పారికర్‌ లేకుండా జరగబోయే తొలి ఎన్నికల్ని ఆ పార్టీ ఎంతవరకు ఎదుర్కోగలదు? పదేళ్లుగా అధికారంలో ఉన్న కమలదళం అధికార వ్యతిరేకతను ఎదుర్కొని నిలబడగలదా? తృణమూల్‌ కాంగ్రెస్, ఆప్, శివసేన వంటి పార్టీల సత్తా ఎంత? కాంగ్రెస్‌ పార్టీ ఏం చేయబోతోంది? అతి చిన్న రాష్ట్రమైన గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా అయిదు నెలలు గడువు ఉన్నప్పటికీ ఎందుకు రాజకీయాలు హీటెక్కుతున్నాయి?  

పర్యాటక ప్రాంతమైన అతి చిన్న రాష్ట్రం గోవా. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో దాదాపుగా పదో వంతు ఉంటుంది. 3,702 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ రాష్ట్ర జనాభా దాదాపుగా 15 లక్షలు. 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. వచ్చే ఏడాది మార్చి 15 వరకు అసెంబ్లీకి గడువుంది. ఎన్నికలకి ఇంకా అయిదు నెలలు సమయం ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లు గోవా బరిలోకి పూర్తి స్థాయిలో దిగుతూ ఉండడం, శివసేన కూడా 25 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో ప్రధాన పార్టీలైన అధికార బీజేపీ, కాంగ్రెస్‌లో ఎవరి ఓటు బ్యాంకుని కొల్లగొడతారన్న చర్చ ఆసక్తికరంగా మారింది. గోవా కాథలిక్కులు కూడా గౌరవించే మనోహర్‌ పారికర్‌ కేన్సర్‌తో 2019లో మరణించడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే. రాష్ట్రంలో ప్రమోద్‌ సావంత్‌ సర్కార్‌ అవినీతిలో కూరుకుపోయిందని రాష్ట్ర మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌  చేసిన ఆరోపణల్ని కాంగ్రెస్‌ ప్రచారాస్త్రాలుగా మలచుకుంది.  

ప్రచారం జోరు  
గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద గత జులై నుంచి నియోజకవర్గాల వారీగా పర్యటించడం ప్రారంభించారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ ఈసారి ఎలాగైనా మెజార్టీ సాధించాలని భావిస్తోంది. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఇప్పటికే గోవాలో పర్యటించి సమర్థవంతులైన నాయకుల్ని ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిదంబరం వంటి జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారం బరిలోకి దిగారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల మూడు రోజులు గోవాలో మకాం వేసి బీజేపీకి బెంగాల్‌లో పట్టించిన గతే ఇక్కడా పట్టిస్తామని ప్రతినబూనారు. ఆప్‌ గత ఎన్నికల్లో ఒక్క సీటు సాధించకపోయినా 6.3% ఓట్లను సాధించింది . దీంతో ఈసారి ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రివాల్‌ దూకుడు పెంచారు. ఆప్‌ అ«ధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పన, అందరికీ ఉచితంగా తీర్థయాత్రల హామీతో ముందుకు వెళుతున్నారు.  

చిన్న నియోజకవర్గాలతో పార్టీలకు చింత 
గోవాలో ప్రతీ నియోజకవర్గంలో 25 వేల నుంచి 30 వేల మంది మాత్రమే ఓటర్లు ఉంటారు. దీంతో స్వల్ప ఓట్లతోనే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. బలమైన అభ్యర్థిని దింపడం కూడా కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించడానికి చిన్న నియోజకవర్గాలే కారణం.  ఈసారి బీజేపీ, కాంగ్రెస్, ఆప్, తృణమూల్‌ కాంగ్రెస్, గోవా ఫార్వార్డ్‌ పార్టీ మహారాష్ట్రవాది గోమాంతక్‌ పార్టీ, ఎన్‌సీపీ, శివసేన , స్థానిక పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల బరిలో ఉండడంతో అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లో ఎవరికి కలిసి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

గత ఎన్నికల్లో దొడ్డి దారిలో వచ్చిన బీజేపీ  
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాలు నెగ్గి కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, 13 స్థానాలు గెలుచుకున్న బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్‌ పారికర్‌ని గోవా ముఖ్యమంత్రిని చేసి చిన్న పార్టీలతో చేతులు కలిపిన బీజేపీ గద్దెనెక్కింది. కేవలం 13 స్థానాలను గెలుచుకున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిన అప్పటి గోవా గవర్నర్‌ మృదుల సిన్హాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా బీజేపీ పారికర్‌ ఇమేజ్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ పార్టీ నుంచి కూడా సభ్యుల్ని లాగేసి బలం పెంచుకుంది. ప్రస్తుతం గోవా అసెంబ్లీలో బీజేపీకి సభ్యుల బలం 28 ఉంటే కాంగ్రెస్‌ బలం నాలుగుకి పడిపోయింది. అప్పట్నుంచి గోవా కాంగ్రెస్‌ తమకు దక్కాల్సిన అధికారాన్ని కొల్లగొట్టిందని బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది.
    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు 
పర్యాటక రంగంపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న రాష్ట్రంలో కరోనా ప్రభావంతో వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది.  గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,200 కోట్లు నష్టం వచ్చినట్టుగా అంచనా. పర్యాటకుల్ని అనుమతిస్తున్నప్పటికీ చాలా హోటల్స్‌లో ఆక్యుపెన్సీ 20 శాతానికి మించడంలేదు. ప్రజల జీవనోపాధిపై దెబ్బపడింది.  
గోవాలో మైనింగ్‌ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో గ్రామీణ ఆర్థిక రంగానికి గట్టి దెబ్బ తగిలింది. జీడీపీలో 30%వాటా, లక్షకు మందికి పైగా ఉద్యోగాలను కల్పించే మైనింగ్‌ నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది 
కరోనా సమయంలో పర్యాటక రంగంలో 1.22 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతే, మైనింగ్‌ నిలిచిపోయి లక్ష మంది వరకు ఉపాధి కోల్పోయారు. దీంతో నిరుద్యోగం 
అంశం రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా మారింది.  

మరిన్ని వార్తలు