రాజకీయ లబ్ధి కోసమే లోకేశ్‌ పర్యటన 

9 Sep, 2021 04:35 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి

టీడీపీ హయాంలో మహిళలపై జరిగిన అత్యాచారాల మాటేంటి 

నరసరావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి 

నరసరావుపేట: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రాజకీయ లబ్ధి కోసమే నరసరావుపేట వస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నరసరావుపేటలో మూడు గ్రూపులతో సతమతమవుతున్న టీడీపీని రక్షించుకునేందుకే వస్తున్నాడు తప్ప.. ఆయనకు మహిళల రక్షణపై ఎటువంటి ఆపేక్ష లేదని స్పష్టం చేశారు. బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో గోపిరెడ్డి మాట్లాడుతూ.. లోకేశ్‌ తీరుపై నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి, తహసీల్దార్‌ వనజాక్షి, వైద్య విద్యార్థిని సంధ్య ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పి నరసరావుపేటలో అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు. నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న లోకేశ్‌ తండ్రి పంచాయితీలు చేశాడే కాని బాధితుల కుటుంబాలకు ఏమైనా న్యాయం చేశారా అని నిలదీశారు.

ప్రస్తుతం నరసరావుపేటలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రమ్య విషాద ఘటన గుంటూరులో జరిగిందని, అంత బాధ్యత ఉంటే అక్కడే ధర్నా చేసుకోవాలని సూచించారు. రమ్య ఉదంతం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధ్యతగా స్పందించినా టీడీపీ నాయకులు శవాన్ని అడ్డుపెట్టుకుని నీచరాజకీయాలకు పాల్పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు వెంటనే రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి సత్వర న్యాయం చేసిందన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశంసించిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి నేరుగా బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినా ఏనాడూ చంద్రబాబు బాధ్యతగా స్పందించిన దాఖలాలు లేవన్నారు.  

అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది? 
నాడు రిషితేశ్వరి తన ఆత్మహత్యకు డైరీలో కారణాలు రాసిందని, ప్రిన్సిపాల్‌ బాబూరావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయని ఎమ్మెల్యే గోపిరెడ్డి గుర్తు చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. నాడు ఒక్క రూపాయి కూడా ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదన్నారు. వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో సైకో ప్రొఫెసర్‌పై బహిరంగ ఆరోపణలు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు, ఆయనను ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు శవ రాజకీయాల కోసం అమాయక ప్రజల మాన, మర్యాదలను మంటగలుపుతున్నారని దుయ్యబట్టారు. దిశ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నిబద్ధత ఉందని, దేశంలో ఏ రాష్ట్రంలో స్పందించని విధంగా ప్రభుత్వం స్పందిస్తోందని తెలిపారు. ఆదుకోవాల్సిన కుటుంబాలను రాజకీయ దుమారాలతో రోడ్లపైకి తీసుకొస్తున్నారని చెప్పారు. నరసరావుపేట టీడీపీలో మూడు గ్రూపులు ఉన్నాయని, వాటి మధ్య టీడీపీ ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. పార్టీ మనుగడ కోసమే లోకేశ్‌ నరసరావుపేటకు వస్తున్నారన్నారు.  

>
మరిన్ని వార్తలు