ఎమ్మెల్సీలుగా గోరెటి వెంకన్న, దేశపతి!

13 Nov, 2020 14:27 IST|Sakshi

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై తుది నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌ : త్వరలో ఖాళీ కానున్న మూడు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిసారించారు. మూడు స్థానాలు కూడా అధికార టీఆర్‌ఎస్‌కే దక్కే అవకాశం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. అభ్యర్థుల జాబితా ఇప్పటికే ఖరారైనట్లు టీఆర్‌ఎస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై శుక్రవారం నాడు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగినే కేబినెట్‌లో చర్చించిన అనంతరం జాబితాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిశీలనలో కవి గోరెటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మాజీమంత్రి బస్వరాజు సారయ్య పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గోరటి వెంకన్న పేరు ఇప్పటికే ఖరారు కాగా, మరో రెండు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఔత్సాహిక నేతల్లో ఉత్కంఠ నెలకొంది. (గ్రేటర్‌లో గెలవాల్సిందే)

తెలంగాణ ఉద్యమ సమయమంలో గోరెటి వెంకన్నతో పాటు, దేశపతి శ్రీనివాస్‌ క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసింది. తెలంగాణ భాషను, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుతూ బస్వరాజు సారయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ఏదో ఒకపదవి ఇస్తారని వార్తలు వచ్చినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే గవర్నర్‌ కోటాలో ఈసారి అవకాశం దకొచ్చని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు గుజరాతీ సామాజికవర్గానికి చెందిన వారి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నేటి మంత్రిమండలి భేటీ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్‌ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్‌రావు తదితరుల పేర్లు వినిపిస్తుండగా.. శుక్రవారం కేబినెట్‌ భేటీలో వీటిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు