MP Sanjay Raut: నాకూ ఆఫర్‌ ఇచ్చారు.. అందుకే వద్దన్నా

2 Jul, 2022 17:08 IST|Sakshi

ముంబై: తిరుగుబాటు వర్గం నుంచి తనకు కూడా ఆఫర్‌ వచ్చినట్టు శివసేన సీనియర్‌ నాయకుడు, ఎంపీ సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. గువాహటిలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చేతులు కలిపేందుకు వచ్చిన అవకాశాన్ని తాను తిరస్కరించినట్టు ఆయన చెప్పారు. 

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను ఏ తప్పు చేయలేదని కాబట్టే నిర్భయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్నాను. అందుకే 10 గంటల పాటు నన్ను విచారించినా బయటకు రాగలిగాను. నేను కూడా గువాహటి వెళ్ళవచ్చు కానీ నేను బాలాసాహెబ్ సైనికుడిని. నిజం మనవైపు ఉన్నప్పుడు, ఎందుకు భయపడాల’ని సంజయ్‌ రౌత్‌ అన్నారు. 

ఏక్‌నాథ్ షిండే శివసేన ముఖ్యమంత్రి కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. ముంబైలో శివసేన బలాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగానే ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కట్టబెట్టిందని ఆరోపించారు. శివసేన పార్టీని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ వ్యూహం ప్రకారం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. తమదే నిజమైన శివసేన అని ఏక్‌నాథ్‌ షిండే వర్గం ప్రచారం చేసుకోవడం ఇందులో భాగమని  తెలిపారు. 

శివసేన ఎంపీలంతా తమవైపే ఉన్నారని.. నిజమైన శివసైనికులు ఎలాంటి ప్రలోభాలకు లొంగరని పేర్కొన్నారు. అసలైన శివసేన ఉద్ధవ్ ఠాక్రేతో ఉందని సంజయ్‌ రౌత్‌ దీమా వ్యక్తం చేశారు. కాగా, మనీ ల్యాండరింగ్‌ కేసులో సంజయ్‌ రౌత్‌ శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు 10 గంటల పాటు ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. (క్లిక్‌: ఏక్‌నాథ్‌ షిండే శివసేన సభ్యత్వం తొలగింపు)

మరిన్ని వార్తలు