ఆ టాక్‌ నిజమేనా..?.. డ్యామేజ్‌ కంట్రోల్‌ అవుతుందా?

21 Sep, 2022 20:04 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు అక్కడ అనేకసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజలకు సేవలందించారు. అయితే ఆయన వారసులు పెద్దాయన పరువు తీసేసారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న ఆ వారసుల్ని అందలం ఎక్కించినా పాత గుణం మానడం లేదట. అందుకే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ను మార్చేయాలనుకుంటున్నారట చంద్రబాబు.
చదవండి: ప్రొద్దుటూరు టీడీపీలో రచ్చ రచ్చ.. వెన్నుపోటుకు సిద్ధంగా ఆ వర్గాలు 

శ్రీకాకుళం జిల్లాలో సర్దార్ గౌతు లచ్చన్నకు ఎంతో పేరు ప్రతిష్టలున్నాయి. ఆయన కుమారుడు గౌతు శివాజీ, మనుమరాలు గౌతు శిరీష.. ఇప్పుడు లచ్చన్న ఇమేజ్‌కు ఎసరు పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 2014 నుంచి నియోజకవర్గంలో ఆమె సాగించిన పెత్తనాన్ని చూసిన ప్రజలు 2019లో ఘోరంగా ఓడించారు. ఎన్నికల్లో ఓడినా ఆమె వెనకటి గుణం మారలేదని టీడీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. తమ్ముళ్ల నుంచి ఒత్తిడి మొదలయ్యే సరికి చంద్రబాబు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారని అంటున్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక పలాసలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు ఏడువందల కోట్ల రూపాయిలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, వంశధార నది నుండి పైపు లైన్ ల ద్వారా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్‌ను ఇంటింటికి అందిస్తున్నారు. కిడ్నీ రోగులకు నెలకు పదివేలు పెన్షన్ ఇవ్వడం వంటి అత్యంత కీలకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన 9 సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి. దీంతో ఉద్దానం పల్లెల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రతి ఒక్కరి మనస్సుల్లో అభిమానాన్ని నింపుకుంటోంది.

ప్రభుత్వ చర్యలతో ఇతర పార్టీల గురించి ఇక్కడి ప్రజలు అలోచించే పరిస్థితి లేదు. టీడీపీ ఇమేజ్ అక్కడ రోజు రోజుకూ దిగజారిపోతోంది. ఈ పరిస్థితి టీడీపీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. దీనికి తోడు బలమైన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీదిరి అప్పలరాజును గౌతు శిరీష తరుచూ బాడీ షేమింగ్ చేయడం.. ఆయన నిర్వహిస్తున్న శాఖ పేరుతో అవమానకరంగా మాట్లాడటం పలాస ప్రజలకు నచ్చడం లేదు. మంత్రి అప్పలరాజు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని శిరీష ఇటీవల రచ్చరచ్చ చేశారు. భూ అక్రమణలపై విచారణ చేపట్టడంతో.. టీడీపీ దొంగల భూ అక్రమణలు బయటపడ్డాయి.

మంత్రి మీద చేసిన ఆరోపణలు టీడీపీకి కలిసి రాకపోగా ఆ పార్టీనే మరింత నష్టపరిచింది. ఈ విషయమై పలాస నుండి ఒక టీం.. శిరీష వ్యవహరంపై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాసారు. ఈ పరిణామాలతో చంద్రబాబు.. శిరీషను మార్చాలనే నిర్ణయానికి వచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటికే ఇక్కడ నుండి ఒక వైద్యుడిని, మరో ప్రముఖ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తిని పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. దీంతో గౌతు శివాజీ డ్యామేజి కంట్రోల్‌కు దిగారు. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె కాదు, తానే పోటీ చేస్తానని కేడర్‌కు చెప్తున్నారట. జరిగిందేదో జరిగిపోయింది, నేనే పోటీ చేస్తాను అని చంద్రబాబుకు కూడా చెప్పుకున్నట్టు సమాచారం. అయితే గౌతు శివాజీ పోటీ చేసినా, కుమార్తె శిరీష హావా కొనసాగుతుందని... ఇక మాకు వీళ్ల సేవలు చాలని తమ్ముళ్లు అనుకుంటున్నారట.

మరిన్ని వార్తలు