కేసీఆర్‌ సర్కార్‌కు షాక్‌.. గవర్నర్‌ తమిళిసై సంచలన నిర్ణయం

25 Sep, 2023 14:51 IST|Sakshi

కేసీఆర్‌కు మరోసారి షాకిచ్చిన గవర్నర్‌ తమిళిసై 

గవర్నర్‌ కోటాలో అభ్యర్థి​త్వాలను తిరస్కరించిన తమిళిసై 

దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణకు షాక్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేసీఆర్‌ ప్రభుత్వం మధ్య వ్యవహారం నువ్వా-నేనా అన్నట్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్‌ తమిళిసై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్‌ తిరస్కరించారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. 

వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై.. కేసీఆర్‌ సర్కార్‌కు మళ్లీ షాకిచ్చారు. రాష్ట్రంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్‌ తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన సిఫార్సులను తమిళిసై తిరస్కరించారు. ఇక, అంతకుముందు కూడా గవర్నర్‌ తమిళిసై ఎమ్మెల్సీ కోటా కింద పాడి కౌశిక్‌ రెడ్డి విషయంలో కూడా ప్రభుత్వ సిఫార్సులను కొద్దిరోజులు హోల్డ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. 

ఈ సందర్బంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కళలు, సాహిత్యం, సైన్స్‌ రంగంలో వీరిద్దరూ పెద్దగా కృషి చేయలేదు. గవర్నర్‌ కోటాలో నామినేట్‌ చేసే అర్హతలు వీళ్లకు లేవు. ఆర్టికల్‌ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదు అని అన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దాసోజు శ్రవణ్‌ ఇటీవలే బీజేపీలో చేరారు. అనంతరం, కొన్ని పరిణామాల నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిపోయారు. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్‌ అయ్యా.. సోనియా సమక్షంలో చేరుతున్నా: మైనంపల్లి

మరిన్ని వార్తలు