బాబు ఏం చెప్పారు?.. జ్యోతుల నెహ్రూ ఎందుకు రగిలిపోతున్నారు?

30 Mar, 2023 17:05 IST|Sakshi

తమది క్రమశిక్షణ గల పార్టీ అని డబ్బా కొట్టుకుంటారు తెలుగుదేశం నాయకులు. కాని ఆ పార్టీలో ఉన్నన్ని గ్రూప్‌లు ఎక్కడా కనిపించవు. కాకినాడ జిల్లా టీడీపీలో తాజాగా జరుగుతున్న కొట్లాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లాలోని సీనియర్ నేతల మధ్య నడుస్తున్న గ్రూప్ పాలిటిక్స్‌ కేడర్‌కు ఆందోళన కలిగిస్తున్నాయని టాక్. ఇంతకీ కాకినాడ దేశంలో ఏం జరుగుతోందో మీరే చదవండి.

కాకినాడలో కస్సు బుస్సు
కాకినాడ జిల్లా తెలుగు దేశం పార్టీలోని కొందరు మాజీ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందట. టీడీపీ నాయకుల ఈ కష్టానికి కారణం అధికార పక్షం అనుకుంటే పొరపాటే. సొంత పార్టీలో నడుస్తున్న గ్రుప్ రాజకీయాలతోనే ఈ పరిస్ధితి దాపురించిందని ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. కాకినాడ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ వ్యవహరిస్తున్నారు.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేయ్యాలని నవీన్ భావిస్తున్నారు. ఎప్పటి లానే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే తండ్రీ, కొడుకులు పోటీ చేయాలనే ప్రతిపాదనలు పార్టీలోని కొందరు సీనియర్లకు రుచించడంలేదు.

ఈ నేపథ్యంలో కొంతకాలం క్రిందట చంద్రబాబును కలిసిన పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల నేతలు ఈ విషయం గురించి చర్చించారు. నవీన్ ఎంపీగా పోటీ చేస్తే.. తమ నియోజక వర్గాల్లో ఆ ఖర్చును తామే భరించాల్సి వస్తే కష్టంగా ఉంటుందని బాబుకు చెప్పారట. ఈ విషయం ఆ జ్యోతుల నెహ్రూకు తెలిసిందట. దీనిపై రగిలిపోతున్న జ్యోతుల నెహ్రూ తన వ్యతిరేకులకు సమయం చూసి ఝలక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. 

కోల్డ్‌ వార్‌ c/o హీట్‌ పాలిటిక్స్‌
జ్యోతుల నెహ్రూ ఎదురు చూసిన సందర్భం వచ్చింది. చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో తన గ్రూప్ పాలిటిక్స్ ను ప్రయోగించారు. ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో తనను, తన కుమారుడిని అడ్డుకునే నేతలకు వ్యతిరేకంగా తన మద్దుతదారులతో నెహ్రూ ఆందోళన చేయించారు. ప్రత్తిపాడు సీటు బీసీలకు ఇవ్వాలని.. పిఠాపురం సీటు జ్యోతుల నవీన్‌కు కేటాయించాలని ఆ నేతలు చంద్రబాబును కలిసి తమ డిమాండ్లు వినిపించారు.

ఐతే కొద్ది రోజులకు ప్రత్తిపాడు ఇన్‌ఛార్జ్‌ వరుపుల రాజా అకాల మరణం చెందారు. ఇక నెహ్రూకు వ్యతిరేకంగా మిగిలింది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మనే. దీంతో వర్మను టార్గెట్ చేసుకుని జ్యోతుల నెహ్రూ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. వర్మకు గాడ్ ఫాదర్ గా ఉండే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పార్టీలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. కాపాడుతూ వస్తున్నారు. జిల్లా పార్టీలో తొలి నుంచీ జ్యోతుల నెహ్రూ.. యనమల రామకృష్ణుడు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. 

పార్టీలో ఎంతో పలుకుబడి ఉన్న యనమల రామకృష్ణుడి కుటుంబంలోనే ప్రస్తుతం టిక్కెట్ వార్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో యనమల తనను కాపాడుతాడనే నమ్మకం వర్మకు కనిపించడంలేదు. దీంతో జ్యోతుల నెహ్రూ బారి నుంచి నెలా బయటపడాలో... భవిష్యత్‌లో జరిగే పరిణామాలు ఎలా తట్టుకోవాలో వర్మకు అర్థం కావడంలేదట. జ్యోతుల టెన్షన్‌తో వర్మకు కంటి మీద కునుకులేకుండా పోయిందనే టాక్‌ నడుస్తోంది.
పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌

మరిన్ని వార్తలు