కమలంలో ముసలం.. పార్టీలో గ్రూపు రాజకీయాలు 

1 Apr, 2022 15:01 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌: బీజేపీలో గ్రూపు రాజకీయాలకు తెరలేచింది. జిల్లా నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ నేతల నుంచి తరచూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. సదానంద్‌రెడ్డి పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర పూర్తయినా.. ఇప్పటికీ క్యాడర్‌పై పట్టు సాధించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య సఖ్యత కొరవడింది.

ఈక్రమంలో జిల్లా అధ్యక్షుడినే మార్చాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ఈ విషయాన్ని కొంతమంది నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బీజేపీకి వెన్నెముక అయిన సంఘ్‌ పరివార్‌.. ప్రస్తుత అధ్యక్షుడి పనితీరుపై అసంతృప్తిగా తెలుస్తోంది. ఆయన స్థానంలో తాండూరుకు చెందిన ఓ నాయకుడికి అవకాశం ఇస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.   
చదవండి: సీఎం భగవంత్‌ మాన్‌ మరొకటి.. చండీగఢ్‌ పంజాబ్‌కే సొంతం

కార్యకర్తల్లో అసంతృప్తి 
బీజేపీ జిల్లా నేతల పనితీరుపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో యువ నాయకత్వం, ఏబీవీపీ, కిందిస్థాయి నాయకులు చురుగ్గా పాల్గొంటుండగా, ముఖ్య నేతలుగా చెప్పుకొంటున్న వారు మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్‌ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా ఉన్న సదానంద్‌రెడ్డి సతీమణి.. ఇప్పటి వరకు అధికార పార్టీ పనితీరును ఎండగడుతూ బీజేపీ పక్షాన  వాయిస్‌ వినిపించలేకపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో జరుగుతున్న పార్టీ కార్యకర్తల

సమావేశాలకు జిల్లా ముఖ్య నేతలు మొహం చాటేయటం కూడా విమర్శలకు తావిస్తోంది. పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి జనార్దన్‌రెడ్డి సైతం కొంత కాలంగా జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అతనికి జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేతతో పొసగకపోవటమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
చదవండి: హైడ్రామా.. కాంగ్రెస్‌ కొంప ముంచిన ఎమ్మెల్యేలు

జిల్లా నేతలు విఫలం  
ఇటీవలే నాలుగు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ మంచి ఊపుమీద కనిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వం కూడా ఈ స్పీడ్‌ను కొనసాగించాలని భావిస్తోంది. దక్షణాదిలో సైతం పట్టుసాధించాలంటే తెలంగాణపై ఫోకస్‌ పెట్టాలని పార్టీ హైకమాండ్‌ నిర్ణయించింది. ఇందుకోసం  క్షేత్రస్థాయి నుంచి బీజేపీ బలోపేతానికి కంకణం కట్టుకుంది.   

దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌పై బీజేపీ గెలుపు.. ఆ వెంటనే జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నలభైకిపైగా కార్పొరేట్‌ స్థానాల కైవసం, ఆ తర్వాత కొద్ది రోజులకే హుజూరాబాద్‌లో ఈటల విజయం, ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలను రాబట్టిన పార్టీ మంచి ఊపుమీదుంది. మంత్రిగా, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఎ.చంద్రశేఖర్‌  బీజేపీలో కొనసాగుతుండటం స్థానిక నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా మారుతారని అంతా భావించారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో ఏసీఆర్‌ పెద్దగా పాల్గొనకపోవడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.    

మరిన్ని వార్తలు