జీఎస్టీ పెంపు సరికాదు వస్త్రపరిశ్రమ బతికి బట్టకట్టలేదు

20 Dec, 2021 02:49 IST|Sakshi

ఇప్పటికే 5 శాతం జీఎస్టీ.. మళ్లీ 7 శాతం పెంపుతో పరిశ్రమ కుదేలు 

జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి  

కేంద్ర మంత్రి గోయల్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం ఇటీవల వస్త్ర పరిశ్రమపై 7 శాతం జీఎస్టీ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. ఇప్పటికే 5 శాతం విధిస్తున్న పన్నుకు ఇప్పుడు 7 శాతం పెంచడం వల్ల 12 శాతానికి చేరుతుందని, దీంతో ఆ పరిశ్రమ కుదేలవుతుందని చెప్పా రు. ఈ మేరకు కేటీఆర్‌ కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆదివారం లేఖ రాశారు.

జనవరి 1 నుంచి అమలుకానున్న 7 శాతం పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రెండేళ్లుగా కరోనా సంక్షోభంతో చేనేతరంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని చెప్పారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది టెక్స్‌టైల్‌ రంగమని, అలాంటి రంగానికి ప్రోత్సాహకాలు అందించాల్సింది పోయి జీఎస్టీ పెంచడం సబబు కాదన్నారు.

దేశ చరిత్రలో ఏనాడూ చేనేత ఉత్పత్తులపై పన్ను లేదని, తొలిసారి 5 శాతం విధించినప్పుడు కూడా తీవ్రమైన వ్యతిరేకత వ చ్చిందని గుర్తుచేశారు. ఇప్పు డు మళ్లీ ఏడు శాతం జీఎస్టీ పెంచితే చేనేతరంగం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచ ప్రఖ్యాతిగాం చిన చీరలకు తెలంగాణ ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. ఒకవేళ పెంపు నిర్ణయాన్ని వెనక్కితీసుకోకుంటే.. ప్రస్తుతం చేనేత, పవర్‌లూమ్‌ వ్యాపారులకు ఉన్న జీఎస్టీ శ్లాబ్‌ను రూ.20 లక్షల నుంచి 50 లక్షల వరకు పెంచాలని కేటీఆర్‌ కోరారు. 

ఇప్పటికే ముడి సరుకుల ధరలు పెరిగాయ్‌.. 
వస్త్ర పరిశ్రమకు అవసరమైన కాటన్, పాలి స్టర్‌ నూలు ధరలు 30–40 శాతం పెరిగాయ ని, కరోనా సంక్షోభంతో విదేశాల నుంచి ది గుమతులు తగ్గి రసాయనాల ధరలు కూడా భారీగా పెరిగాయని కేటీఆర్‌ తెలిపారు.

2011 లెక్కల ప్రకారం 43.3 లక్షల కుటుం బాలు చేనేత రంగంలో ఉంటే తాజా లెక్కల ప్రకారం 30.44 లక్షల కుటుంబాలు మాత్ర మే ఉన్నాయన్నారు. ఇదే ధోరణి కొనసాగితే రానున్న కొద్ది సంవత్సరాల్లోనే దేశంలో చేనేత రంగం అంతర్థానమయ్యే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.  

చేనేతను బలోపేతం చేయాలి 
2015లో ప్రధాని మోదీ చేనేతకు చేయూతనిస్తామన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని, గతేడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి ‘వోకల్‌ ఫర్‌ హ్యాండ్‌ మేడ్‌’అన్న నినాదం ఇచ్చారని కేటీఆర్‌ లేఖలో గుర్తు చేశారు.

జాతీయ చేనేత ఉత్పత్తులను రెట్టింపు చేసి రూ.1.25 లక్షల కోట్లకు, దేశీయ చేనేత ఎగుమతులను నాలుగు రెట్లు పెంచి రూ.10 వేల కోట్లకు తీసుకుపోతామన్న హామీని దృష్టిలో పెట్టుకోవాలని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు