'అది టీడీపీ కాదు.. ట్విటర్‌ జూమ్‌ పార్టీ'

20 Aug, 2020 12:03 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం :  విశాఖ అభివృద్దిలో నాడు వైఎస్సార్..నేడు సీఎం వైఎస్ జగన్ మాత్రమే కనిపిస్తారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాధ్ అన్నారు. వైఎస్సార్ హయాంతో పాటు నేడు సీఎం వైఎస్ జగన్ హయాంలో విశాఖలో జరిగిన అభివృద్దిని‌ మించి చంద్రబాబు చేసినట్లునిరూపిస్తే తాను రాజీనామాకి సిద్దమని చంద్రబాబుకి సవాల్ విసిరారు. విశాఖ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అమర్నాద్ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపై చంద్రబాబు ఎందుకు విషం‌ కక్కుతున్నారో అర్ధం‌కావటం లేదన్నారు. విశాఖ నగరానికి మేలు చేయాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ పరిపాలనా రాజధాని ప్రకటించినప్పటి నుంచి విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.(ఆయన ప్రజాదరణ లేని వ్యక్తి)

విశాఖలో అన్ని‌ప్రాంతాల ప్రజలు సంతోషంగా నివసిస్తుంటే ఈ నగరంపై చంద్రబాబు బురదజల్లుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 22 ఏళ్లలో విశాఖకి ఏం చేశారని‌ ప్రశ్నించారు. మీ హయాంలో విశాఖకి చేసిన మేలు ఏమైనా ఉందా అని అడిగారు. రాష్డ్ర విభజన సమయంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి మీరు అమరావతిలో రాజధాని ఎందుకు పెట్టారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం అనేది పెద్ద స్కామ్ అని.. మూడు పంటలు పండే భూములని రాజధాని పేరుతో తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది నిజం‌ కాదా అని గుడివాడ ప్రశ్నించారు. టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్ మంగళగిరిలో ఎందుకు ఓడిపోయారో చెప్పాలన్నారు. మైసూరు బొండాంలో మైసూరు లేనట్లు అమరావతి రాజధానిలో రాజధాని‌లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు ఆధారాలు చూపలేకపోయారని ప్రశ్నించారు. 

వారిది టీడీపీ కాదు.. టీజేపీ.. టీజేపీ అంటే ట్విటర్‌ జూమ్‌ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు పది మర్డర్లు...లోకేష్ 20 మానభంగాలు చేశారని తాను ‌కూడా ఆరోపించగలనన్నారు. విశాఖని అమ్మకానికి ఎపుడు పెడదామా అన్న చరిత్ర చంద్రబాబుదని ఉదహరించారు. విశాఖలో 20 లక్షల‌ కోట్ల పెట్టుబడులు... 43 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తప్పుడు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబుపై ఫిర్యాదు చేయాలనుకున్నా.. ఆయన మానసిక స్ధితి చూసి వదిలేశామన్నారు. విశాఖపై చంద్రబాబు ఎందుకు పగబట్టారో అర్ధం కావటం లేదన్నారు.

అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై చంద్రబాబు చెప్పిన మాటలు తర్వాత మాకు అనుమానాలు కలుగుతున్నాయని.. చంద్రబాబు ఆమ్మోనియం నైట్రేట్ పేలుళ్లకి పాల్పడే కుట్రలు చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడవద్దని విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలని తాను కోరుతున్నట్లు స్పష్టం చేశారు. మీ హయాంలో జరిగిన భూకుంభకోణాలు దేశంలోనే అతిపెద్ద స్కామ్‌లని గుడివాడ ఆరోపించారు. కరోనా కట్టడి చర్యల విషయంలో దేశంలోనే ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా ఉందన్నారు. మీ అక్రమాలు బయటపడితే ఇతర దేశాలకి పారిపోవాల్సిందేనని ఎమ్మెల్యే అమరనాథ్‌ ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా