పాదయాత్ర రద్దుపై హైకోర్టులో విచారణ.. అవసరమైతే పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అవుతాం: మంత్రి అమర్నాథ్‌

27 Oct, 2022 15:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి రైతుల పాదయాత్ర రద్దు చేయాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పాదయాత్ర రద్దుతోపాటు దాఖలైన అన్ని పిటిషన్లపై శుక్రవారం వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. పాదయాత్రపై తమ ఆదేశాలను పాటించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. పాదయాత్రలో అనుమతించిన 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని హైకోర్టు పేర్కొంది. పాదయాత్రపై విచారణ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కోర్టుకు హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ.. రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై న్యాయస్ధానం ఇచ్చిన అర్డర్ అనుసరించాల్సి ఉందన్నారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌లో 17 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు పార్టీలుగా చేర్చారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి సీనియర్ కౌన్సిల్‌తో కోర్టుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. తమ ప్రాంత ప్రజలు అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నారన్న అమర్నాథ్‌.. వారి మనోభావాలను కోర్టుముందు ఉంచటానికే వచ్చినట్లు స్పష్టం చేశారు.

ప్రజా ప్రతినిధుల ఆకాంక్షలు మేం చెప్పకుండా ఎలా ఉంటాం. శుక్రవారం మధ్యాహ్నం వాదనలు వింటామని కోర్టు చెప్పింది. అవసరమైతే ఈ పిటిషన్‌లో ఇంప్లీడ్ అవుతాం. కోర్టు ఆదేశాల తరువాత పోలీసులు పాదయాత్రను పరిశీలిస్తే 25 మంది దగ్గర కూడా ఐడీ కార్డులు లేవు. కోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. విశాఖతో పాటు అమరావతి కూడా బాగుండాలని మేం కోరుకుంటున్నాం. కాని అమరావతి రైతులు మాత్రం మేమే బాగుపడాలని అంటున్నారు. రెచ్చగొట్టేలా ఏ పని చేయవద్దని మేం అంటున్నాం.’ అని వ్యాఖ్యానించారు.
చదవండి: సీఎం జగన్‌ సామాజిక సాధికారతకు న్యాయం చేశారు

>
మరిన్ని వార్తలు