ఈనాడు’ రాతలు సమాజానికి హానికరం: మంత్రి అమర్‌నాథ్‌

25 Feb, 2023 14:13 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ జరగనుందని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు.  ఇన్వెస్టర్‌ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  50 దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారని అన్నారు.

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఆపారని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనేదే ఈనాడు ఉద్ధేశమని మండిపడ్డారు. బాబు హయాంలో పరిశ్రమలకు బకాయి పెట్టిన రూ. 3600 కోట్లను సీఎం జగన్‌ విడుదల చేశారని గుర్తు చేశారు. పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని ప్రభుత్వంపై ఈనాడు తప్పుడు కథనాలు చేస్తుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిజం ముసుగులో రామోజీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

‘సీఎం జగన్‌కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశ్యంతో ఈనాడు తప్పుడు కథనాలు రాస్తుంది. చంద్రబాబు సీఎం అవడం కోసం ఎంత నీచనికైనా దిగజారుతుంది. పట్టాభి గురించి ప్రజలను మభ్యపెట్టే విధంగా వార్తలు రాశారు. వైఎస్‌ జగన్‌పై కోపం ఉంటే రామోజీరావు ఒక పార్టీ పెట్టుకోమనండి. సీఎం జగన్ మీద ఉన్న కోపంతో రామోజీరావు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఈనాడు దినపత్రిక రాతలు సమాజానికి హానికరం’ అని మంత్రి ధ్వజమెత్తారు.
చదవండి: 'జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు?'

మరిన్ని వార్తలు