ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు

6 May, 2022 05:06 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్, చిత్రంలో డిప్యూటీ సీఎం రాజన్నదొర తదితరులు

విశాఖకు పరిపాలన రాజధాని రాకుండా అడ్డుకుంటున్నారు

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌  

విజయనగరం అర్బన్‌/సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నానికి పరిపాలన రాజధాని రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న చంద్రబాబు.. చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చి కపట ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. గురువారం విజయనగరం కలెక్టరేట్‌ వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకమూ పేదలకు అందలేదన్నారు. ‘తెలుగుదేశం పార్టీకి బాధలే బాధలు’ అని చంద్రబాబు చెప్పుకోవాలని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు డాక్టర్‌ సురేష్‌బాబు, రఘురాజు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. 

విశాఖ రాజధాని కావడం తథ్యం
14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు విశాఖ నగరాన్ని ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని మంత్రి గుడివాడ అమర్‌నా«థ్‌ నిలదీశారు. ఆయన విశాఖ లో మాట్లాడుతూ.. అబద్ధాల బాబు ఇప్పుడు విశాఖకు వచ్చి విశాఖ అభివృద్ధి కావాలా? రాజధాని కావాలా? అని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలా? రాజధాని కావాలా? అని చంద్రబాబుని ఉత్తరాంధ్ర వాసులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. దీనికి చంద్రబాబు ఏమని సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖ రాజధాని కావడం తథ్యమని చెప్పారు. చంద్రబాబుకు సీఎం పీఠం ఎలా వచ్చిందో, ఎవరిని వెన్నుపోటు పొడిచి తెచ్చుకున్నాడో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా డీబీటీ ద్వారా దాదాపు రూ.1.39 లక్షల కోట్లు పేదల చేతిలో పెట్టిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ధరలను కూడా రాష్ట్రంపై నెడుతున్నాడని విమర్శించారు. కేంద్రమన్నా, నరేంద్రమోదీ అన్నా చంద్రబాబుకి భయమని మంత్రి వివరించారు.  

మరిన్ని వార్తలు