టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్య్రం ఎప్పుడు?

16 Aug, 2022 04:21 IST|Sakshi

పవన్‌ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

అనకాపల్లి టౌన్‌: టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్య్రం ఎప్పుడని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తానని పవన్‌ కల్యాణ్‌ సూటిగా చెప్పగలరా అని సవాల్‌ విసిరారు. రాజకీయ పార్టీని స్థాపించి.. ఆ తర్వాత ఇతర పార్టీలకు కొమ్ముకాస్తున్న పవన్‌కు జగన్‌ పాలనపై మాట్లాడే అర్హత లేదన్నారు. టీడీపీకి ఉపయోగపడాలన్నదే పవన్‌ కల్యాణ్‌ పాలసీ అని, ఆ పార్టీ మేలు కోసమే జనసేన పార్టీ పెట్టారని నిప్పులు చెరిగారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా ఇంగిత జ్ఞానం లేకుండా పవన్‌ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం మంత్రి అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై పవన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని.. మరి టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్య్రం వచ్చిందో, లేదో పవన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్యాకేజీ రాజకీయాలకు అలవాటు పడ్డ పవన్‌ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి స్వాతంత్య్రం వచ్చిందా, లేదా అని ప్రశ్నించారు. ముందు టీడీపీ నుంచి స్వాతంత్య్రం తెచ్చుకుని తమ గురించి మాట్లాడాలన్నారు. పవన్‌కు టీడీపీ నుంచి స్వాతంత్య్రం రానప్పుడు తమ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. 

బాబుకు మేలు చేద్దామనే తాపత్రయం ఎందుకు?
కులం, ప్రాంతాన్ని చూసి పార్టీ పెట్టలేదంటూ పవన్‌ ప్రజలను మభ్యపెడుతున్నారని మంత్రి అమర్‌నాథ్‌ మండిపడ్డారు. చంద్రబాబుకు మేలు చేద్దామనే తాపత్రయం పవన్‌కు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. పవన్‌ వల్ల చంద్రబాబుకు మేలు తప్ప రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి మేలు చేకూరదన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బాబుతో లాలూచీ ఉంటే వాటిని అంతర్గతంగా చూసుకోవాలని.. వాటిని వదిలేసి ఎవరికో మేలు చేయడం కోసం తమపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.2,300 కోట్లతో చేపట్టిన ఏటీసీ టైర్ల కంపెనీని ప్రారంభించి.. 5 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారని తెలిపారు. పవన్‌కు సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్రానికి కొత్తగా వస్తున్న ప్రాజెక్టులు కళ్లకు కనిపించడం లేదా? అని నిలదీశారు. 

పథకాలెందుకని ప్రశ్నించడం ఏమిటి?
గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని రాష్ట్రంలోకి తెచ్చిన మొట్టమొదటి సీఎం వైఎస్‌ జగన్‌ అని గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా సమస్యలను స్థానికంగానే పరిష్కరిస్తున్నారని కొనియాడారు. అవినీతి లేకుండా సంక్షేమ పథకాల నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారని ప్రశంసించారు. ఈ పథకాలెందుకని పవన్‌ ప్రశ్నించడం ఏమిటన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. గ్రామాల్లోకి వెళ్లి పేదలను అడిగితే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి గురించి చెబుతారని చెప్పారు. రాష్ట్రంలో పేదోడి ఆనందాన్ని చూడలేక నోటికొచ్చిన విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.  

మరిన్ని వార్తలు