Gujarat Assembly Election 2022: కాంగ్రెస్‌ను ఊడ్చేస్తుందా?

30 Nov, 2022 05:28 IST|Sakshi

కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు ఈసారి ఆప్‌ గండి!

ప్రధాన విపక్షంగా నిలవొచ్చంటూ విశ్లేషణలు

గుజరాత్‌లో అధికార పీఠం కోసం మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎడాపెడా హామీలతో ప్రచార పర్వాన్ని ఇప్పటికే రక్తి కట్టించాయి. రేపు తొలి దశకు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. డిసెంబర్‌ 5న రెండో, తుది దశ పోలింగ్‌తో అన్ని పార్టీల భవితవ్యమూ ఈవీఎంల్లోకి చేరనుంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ వేటికవే గెలుపుపై ధీమా వెలిబుచ్చుతున్నా అంతర్గతంగా మాత్రం ఇప్పటికే లోతుగా విశ్లేషణల్లో మునిగిపోయాయి.

మూడో పక్షంగా బరిలోకి దిగిన ఆప్‌ ఈసారి గట్టిగా ఉనికి చాటుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు ఆప్‌ గట్టిగా గండి కొట్టొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు...! గుజరాత్‌లో ఈసారి ఆప్‌ ఏకంగా 22 శాతం ఓట్లు సాధిస్తుందని సీఎస్‌డీఎస్‌ లోక్‌నీతి ఇటీవల చేసిన సర్వేలో తేలడం విశేషం! పరిస్థితులు కలిసొస్తే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ స్థానాన్ని ఆప్‌ భర్తీ చేస్తుందని కూడా సర్వేను పర్యవేక్షించిన భాను పర్మార్‌ అభిప్రాయపడ్డారు.

ఇది కాంగ్రెస్‌కు కచ్చితంగా ఆందోళనకర పరిణామమేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీకి గట్టి ఓటు బ్యాంకుంది. కనుక ఆప్‌ దెబ్బ గట్టిగా పడేది బహుశా కాంగ్రెస్‌ మీదే. అందుకే ఈసారి ఆ పార్టీకి నష్టం భారీగానే ఉండొచ్చు’’ అని విశ్లేషించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్‌ ప్రదర్శన ఈ అభిప్రాయాలను బలపరిచేదిగానే ఉంది. వాటిలో పార్టీకి 13.28 శాతం ఓట్లు దక్కాయి.

సూరత్‌లో అదే జరిగింది...
రాష్ట్రంలో సూరత్‌ ప్రాంతంలో ఆప్‌కు ఆదరణ బాగానే ఉంది. సూరత్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 120 సీట్లకు ఆప్‌ 27 స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టింది కూడా! ఈ ప్రాంతంలోని 12 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి 7 నుంచి 8 గెలుస్తామని ఆప్‌ నేత కేజ్రీవాల్‌ ధీమా చెబుతున్నారు. సూరత్‌తో పాటు సౌరాష్ట్ర ప్రాంతంపైనా ఆప్‌ గట్టిగానే దృష్టి సారించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసి ఈసారి ఎటూ నిర్ణయించుకోలేని ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.

వీరితో పాటు దశాబ్దాలుగా ఓడుతున్న కాంగ్రెస్‌ తీరుతో విసిగిపోయిన ఆ పార్టీ లాయలిస్టులు, బీజేపీపై ఆగ్రహంగా ఉన్న వర్గాల ఓట్లు కూడా రాబట్టగలిగితే ఆప్‌ అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు సాధించవచ్చని రాజకీయ విశ్లేషకుడు ధవల్‌ వాస్వాడా అభిప్రాయపడ్డారు. ‘‘దీనికి తోడు గ్రామీణ గుజరాత్‌ ఓటర్లు బీజేపీ కంటే కాంగ్రెస్‌కే మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ఆప్‌ వారిని కూడా ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది! పట్టణ ప్రాంతాల్లో యువత, విద్యాధికుల్లో పార్టీకి ఎటూ ఎంతో కొంత ఆదరణ ఉంటుంది. అది అదనపు లాభంగా కలిసొస్తుంది’’ అని ఆయన  విశ్లేషించారు.

తొలి దశ ప్రచారానికి తెర
89 అసెంబ్లీ స్థానాలకు రేపే పోలింగ్‌
అహ్మదాబాద్‌: గుజరాత్‌ శాసనసభకు సంబంధించిన తొలి దశ ఎన్నికల ప్రచారపర్వం మంగళవారం ముగిసింది. తొలి దశలో దక్షిణ గుజరాత్, కచ్‌–సౌరాష్ట్ర పరిధిలోని 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉండగా ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ తొలిసారిగా బరిలో దూకి త్రిముఖపోరుగా మార్చేసింది. ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఏసుదాన్‌ గడవీ పోటీ చేస్తున్న దేవభూమి ద్వారాక జిల్లాలోని ఖంభాలియా నియోజకవర్గంలో సైతం తొలి దఫాలోనే పోలింగ్‌ జరగనుంది.

డిసెంబర్‌ ఒకటో తేదీన పోలింగ్‌ ఉంటుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పురుషోత్తం సోలంకీ, ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన కున్వర్‌జీ బవలియా, మోర్బీ ‘హీరో’ కాంతీలాల్‌ అమృతియా, క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా, గుజరాత్‌ ఆప్‌ అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా తదతరులూ తొలి దఫాలోనే అదృష్టం పరీక్షించుకోనున్నారు. 89 మంది బీజేపీ, 89 మంది కాంగ్రెస్, 88 మంది ఆప్‌ అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ తొమ్మిది మంది, కాంగ్రెస్‌ ఆరుగురు, ఆప్‌ ఐదుగురు మహిళలకు టికెట్లు ఇచ్చింది. మొత్తం అభ్యర్థుల్లో 718 మంది పురుషులు, 70 మంది మహిళలున్నారు. 2,39,76,670 మంది ఓటేయనున్నారు. 9 వేలకుపైగా పట్టణ ప్రాంతాల్లో, 16వేలకుపైగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ జరగనుంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు