Gujarat Assembly Election 2022: గిరిజనులంటే కాంగ్రెస్‌కు అలుసు

24 Nov, 2022 06:14 IST|Sakshi
మెహసానాలో సభలో జ్ఞాపిక అందుకుంటున్న మోదీ 

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజం 

రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థికి మద్దతివ్వలేదు  

పైగా ఆమెను ఓడించేందుకు అభ్యర్థిని పోటీకి దింపారు 

గుజరాత్‌లో మోదీ ఎన్నికల ప్రచారం  

దాహోడ్‌/మెహసానా:  ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థిగా ఎందుకు మద్దతివ్వలేదని ప్రధాని మోదీ నిలదీశారు. ఆయన బుధవారం గుజరాత్‌లోని దాహోడ్‌ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోగా, ఆమెను ఓడించేందుకు ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టిందని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గిరిజనుల ఆశీస్సులతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని తెలిపారు. దాహోడ్‌ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని నరేంద్ర మోదీ వెల్లడించారు.  

కాంగ్రెస్‌ మోడల్‌ అంటే ఇదే..  
అవినీతి, కులతత్వం, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, మత విద్వేషం, సమాజంలో విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్‌ మోడల్‌ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్‌ మోడల్‌ కేవలం గుజరాత్‌నే కాదు, మొత్తం దేశాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆయన బుధవారం మెహసానాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఎప్పటికీ పేదలుగా ఉండిపోవాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమన్నారు. దురభిమానం, వివక్షను బీజేపీ ఏనాడూ నమ్ముకోలేదని, అందుకే యువత తమ పట్ల విశ్వాసం చూపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ఎంతగానో శ్రమిస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. వడోదరలోనూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మరిన్ని వార్తలు