Gujarat Assembly Election 2022: అధికారం కోసమే జోడో యాత్ర

22 Nov, 2022 06:00 IST|Sakshi

సురేంద్రనగర్‌:  కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అధికారం కోల్పోయినవారు మళ్లీ గద్దెనెక్కడానికి పాదయాత్ర సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారిని చాలా ఏళ్ల క్రితమే ప్రజలు గద్దెదింపారని చెప్పారు. మోదీ సోమవారం గుజరాత్‌లోని సురేంద్రనగర్, నవసారి, జంబూసార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఎన్నికల సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడకుండా, తన(మోదీ) ఔకత్‌(స్థాయి) ఏథమిటో బయటపెడతామని సవాళ్లు విసురుతున్నారని ఆక్షేపించారు. వారి ఆహంకారాన్ని ప్రజలు గమనించాలని కోరారు. వారు(కాంగ్రెస్‌ పెద్దలు) రాజకుటుంబం నుంచి వచ్చారని, తాను కేవలం ఒక సేవకుడినని, తనకు పెద్ద స్థాయి లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలు గతంలో తనను దిగజారుడు భాషలో దూషించారని గుర్తుచేశారు. స్థాయిల సంగతి పక్కనపెట్టి అభివృద్ధి గురించి మాట్లాడుకుందామని ప్రతిపక్షానికి హితవు పలికారు. తన దృష్టి మొత్తం దేశ ప్రగతి పైనే ఉందని.. అవమానాలు, దూషణలను జీర్ణించుకుంటానని చెప్పారు.  

గుజరాత్‌ ఉప్పు తింటూ అవమానిస్తున్నారు  
నర్మదా ప్రాజెక్టును అడ్డుకొని, గుజరాత్‌ గొంతెండిపోయేలా చేసినవారిని పక్కన పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. నర్మదా ప్రాజెక్టును వ్యతిరేకించిన వారికి గుజరాత్‌ ప్రజలు బుద్ధిచెప్తారని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అప్పట్లోనే తాను గట్టిగా వాదించానని, ఇప్పుడు ఈ లాభాలు కళ్లముందే కనిపిస్తున్నాయని వివరించారు. పాదయాత్ర చేస్తున్న వారికి వేరుశనగ పంటకు, పత్తి పంటకు మధ్య తేడా తెలియదని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కొందరు వ్యక్తులు గుజరాత్‌లో తయారవుతున్న ఉప్పు తింటూ గుజరాత్‌నే అవమానిస్తున్నారని తప్పుపట్టారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ఉప్పులో గుజరాత్‌ వాటా 80 శాతం ఉందని గుర్తుచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కొన్ని స్థానాల్లో గెలిపించడం ద్వారా సురేంద్రనగర్‌ జిల్లా ప్రజలు పొరపాటు చేశారని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.

మరిన్ని వార్తలు