Gujarat Assembly Election 2022: సౌరాష్ట్ర ఎవరికి సై?

20 Nov, 2022 05:14 IST|Sakshi

సౌరాష్ట్ర.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. పటీదార్ల ఉద్యమానికి కేంద్ర బిందువు. ఈ ఉద్యమ ప్రభావంతో గత ఎన్నికల్లో ఈ ప్రాంతంపై పట్టు కోల్పోయిన బీజేపీ తిరిగి పూర్వవైభవం సాధించడానికి ప్రయత్నిస్తోంది. మరి సౌరాష్ట్ర ఓటర్లు ఎవరకి జై కొడతారు...?

సౌరాష్ట్ర కేంద్రంగా 2015లో మొదలైన పటీదార్‌ (పటేళ్లు) ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రంలో అగ్రకులమైన పటేళ్లను ఒబిసిలో చేర్చాలని, వారికి కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో యువ నాయకుడు హార్థిక్‌ పటేల్‌ నేతృత్వంలో సాగిన ఉద్యమం 2017 ఎన్నికల్లో బీజేపీని బాగా దెబ్బ తీసింది. సౌరాష్ట్రలో పటీదార్లు, ఒబీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పటీదార్లు చేసిన ఉద్యమంతో 2017 ఎన్నికల్లో మొత్తం 48 స్థానాలకు గాను 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది.

ఆ ఎన్నికల్లో హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌కు వెలుపల నుంచి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ ఏకంగా 28 స్థానాలను గెలుచుకొని తన పట్టు పెంచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీని 99 స్థానాలకే పరిమితం చేయగలిగింది. ఇప్పుడపా మాదిరి భావోద్వేగ పరిస్థితుల్లేవు. పటీదార్ల ఉద్యమం చల్లారింది. హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌లో చేరినా 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేకపోయింది. హార్దిక్‌ ఇప్పుడు బీజేపీలో చేరారు. విరమ్‌గమ్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగింది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగా మారేలా ఉన్నాయి.

సౌరాష్ట్రలో పటీదార్లు, కొలి జనాభా 40% దాకా ఉంది. 18 అసెంబ్లీ స్థానాల్లో పటీదార్ల ఓట్లు, 10 అసెంబ్లీ స్థానాల్లో కొలి వర్గం ఓట్లు నిర్ణయాత్మకం. ఓబీసీ, క్షత్రియులు, మత్స్యకారులు కూడా ప్రభావం చూపించగలరు. ‘‘సౌరాష్ట్ర యువ ఓటర్లు ఈసారి ఆప్‌వైపు మొగ్గుతున్నారు. పటీదార్లు వ్యాపారాలంతా ఆప్‌కు అవకాశమిద్దామని అనుకుంటున్నారు. కొలి, ఇతర ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్‌కి ఓటేయొచ్చు’’ అని రాజకీయ విశ్లేషకుడు దిలీప్‌ గొహ్లి అభిప్రాయపడ్డారు.

బీజేపీ ఓబీసీ మంత్రం
సౌరాష్ట్రలో  48 సీట్లలో సగానికిపైగా స్థానాల్లో పటేళ్ల ఆధిక్యం ఉంది. హార్దిక్‌ వంటి నాయకుల్ని బీజేపీ తమ వైపు తిప్పుకున్నా పటేళ్లలో ఉపకులాల కారణంగా అందరూ బీజేపీ వైపుండే పరిస్థితి లేదు. దీంతో బీజేపీ ఓబీసీలకు టిక్కెట్లు ఎక్కువ ఇచ్చింది. 2017 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంపయ్యారు. పటీదార్, కొలి, అహిర్‌ సామాజిక వర్గాలకు చెందిన కున్వర్జీ బవాలియా, బ్రిజేశ్‌ మెర్జా, చవడ వంటి అగ్రనాయకులూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.

సంపన్న సౌరాష్ట్ర
సౌరాష్ట్ర ప్రాంతం మొదట్నుంచి సంపన్న ప్రాంతమే. అరేబియా తీరంలో ఉండే ఈ ప్రాంతంలో సహజవనరులు చాలా ఎక్కువ. నీటి లభ్యత ఎక్కువగా ఉండడం వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఇటీవల కాలంలో కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది.2019లో సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ దగ్గర నర్మద నది నుంచి నీళ్ల ట్యాంకర్లతో సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ ప్రాంతంలో 11 జిల్లాలున్నాయి. సురేంద్రనగర్, మోర్బీ, రాజ్‌కోట్, జామ్‌నగర్, దేవ్‌భూమి ద్వారక, పోర్‌బందర్, జునాగఢ్, గిర్‌ సోమ్‌నాథ్, అమ్రేలి, భావనగర్, బోతాడ్‌.. ఈ 11 జిల్లాలకు గాను బీజేపీ 2017 ఎన్నికల్లో మోర్బీ, గిర్‌ సోమ్‌నాథ్, అమ్రేలి జిల్లాల్లో ఒక్క సీటు సాధించలేకపోయింది. ఈ సారి ఎన్నికల్లో అధిక ధరలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, నీటి సమస్య కీలకం కానున్నాయి.

– సాక్షి నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు