Gujarat Assembly Election 2022: గుజరాత్‌లో ముక్కోణపు పోటీ!

4 Nov, 2022 05:37 IST|Sakshi

ఎన్నికల బరిలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ 

ప్రచారంలో ముందంజలో రెండు పార్టీలు 

బీజేపీకి గుబులు పుట్టిస్తున్న ప్రజా వ్యతిరేకత 

ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో పాగా వేసేందుకు ఆప్‌ తహతహ  

అహ్మదాబాద్‌:  గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలయ్యింది. కొత్తగా ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఆగమనంతో ఈసారి ముక్కోణపు పోటీ జరగబోతోంది. రాష్ట్రంలో దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఎన్నికల పోటీ కొనసాగుతోంది. ఇప్పుడు ‘ఆప్‌’ సైతం ఆ రెండు పార్టీలకు సవాళ్లు విసురుతూ రణరంగంలోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతం చేసింది. హిందుత్వ కార్డుతోపాటు డబుల్‌ ఇంజన్‌ సర్కారు, సుపరిపాలన కొనసాగింపు అంటూ అధికార బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు గుజరాత్‌లో తరచుగా పర్యటిస్తున్నారు. ఇటీవలి కాలంలో రూ.వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు మోదీ శంకస్థాపనలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జనంపై హామీల వర్షం కురిపించారు. నరేంద్ర–భూపేంద్ర (గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌) భాగస్వామ్యానికి మళ్లీ పట్టం కట్టాలని కోరారు. ధరలు, నిరుద్యోగం పెరగడంతోపాటు మోర్బీ పట్టణంలో తీగల వంతెన దుర్ఘటన బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది.

బిల్కిస్‌ బానో కేసులో దోషులకు శిక్ష తగ్గించడం, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, ప్రశ్నాపత్రాల లీక్‌ వల్ల పరీక్షలను వాయిదా వేయడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, వంటి సౌకర్యాలు కొరవడడం, పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం దక్కకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా మారడం, విద్యుత్‌ చార్జీలు పెరిగిపోవడం, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం బలవంతపు భూసేకరణ పట్ల ప్రజల్లో ఆగ్రహావేశాలు బీజేపీని బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో 1995 నుంచి చూస్తే మధ్యలో రెండేళ్లు మినహా(1996–1998) ఆ పార్టీ అధికారంలో కొనసాగుతోంది.  

కాంగ్రెస్‌లో నిస్తేజం  
మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నప్పటికీ గుజరాత్‌లో నెగ్గడం బీజేపీకి అత్యంత కీలకం. వరుసగా ఆరు సార్లు గెలిచిన ఆ పార్టీ మరోసారి విజయంపై కన్నేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడంతో బీజేపీ ఈసారీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో 27 ఏళ్లుగా ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతున్న కాంగ్రెస్‌ ఈసారి అధికార పక్షంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. అయితే, ప్రచార పర్వంలో వెనుకబడడం, పార్టీ జాతీయ నాయకులు ఇప్పటికీ గుజరాత్‌ వైపు కన్నెత్తి చూడకపోవడం ప్రతికూలంగా మారింది. యువనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రతో తీరిక లేకుండా ఉన్నారు.

రాష్ట్రంలో ప్రచారంలో ఆయన పాల్గొంటారా లేదా అనేది నిర్ధారణ కాలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పైనే కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 111, కాంగ్రెస్‌కు 62, ఎన్సీపీకి ఒకరు, భారతీయ ట్రైబల్‌ పార్టీ(బీటీపీ)కి ఇద్దరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌తోపాటు మరికొన్ని చిన్న పార్టీలు సైతం ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కూడా గుజరాత్‌ ఎన్నికలపై దృష్టి పెట్టారు. మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు.    

‘ఆప్‌’ సంక్షేమవాదం  
ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రివాల్‌ ఓటర్లపై సంక్షేమ వల విసురుతున్నారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నారు. పంజాబ్‌ను చేజిక్కించుకొని ఉత్సాహంతో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి గుజరాత్‌పై ఆశలు పెరుగుతున్నాయి. గుజరాత్‌లో పాగా వేస్తే జాతీయ స్థాయిలో తమ ప్రతిష్ట ఇనుమడించి, బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించడం ఖాయమని ఆప్‌ భావిస్తోంది. సంక్షేమవాదాన్నే ఆ పార్టీ నమ్ముకుంది. నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు, పిల్లలకు ఉచిత విద్య, నిరుద్యోగ యువతకు భృతి, మహిళలు, కొత్త న్యాయవాదులకు ప్రతినెలా రూ.1,000 చొప్పున భత్యం వంటివి ‘ఆప్‌’ ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారాయి. కేజ్రివాల్, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇతర పార్టీల కంటే ముందే ‘ఆప్‌’ ప్రచారం ప్రారంభించడం విశేషం. ఇప్పటికే 73 స్థానాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించింది. 

మరిన్ని వార్తలు