నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. గుజరాత్‌లో బీజేపీకి షాక్ తగులుతుందా?

21 Nov, 2022 06:41 IST|Sakshi

గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి విద్యుత్‌ షాక్‌ తగులుతుందా ? నానాటికీ పెరిగిపోతున్న చార్జీలు ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీస్తాయా ? సామాన్య జనమే కాదు. బడా బడా పారిశ్రామికవేత్తలు కూడా విద్యుత్‌ టారిఫ్‌లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వేళ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్‌ హామీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతోంది ?
 

గుజరాత్‌లో విద్యుత్‌ బిల్లుల భారం తడిసిమోపెడు అవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ప్రభుత్వం నాలుగు సార్లు చార్జీలను పరోక్ష పద్ధతిలో పెంచింది. ఎన్నికల ఏడాది కావడంతో నేరుగా గుజరాత్‌ ఎలక్ట్రిసిటీ కమిషన్‌ చార్జీల భారాన్ని మోపకుండా ఫ్యూయెల్‌ అండ్‌ పవర్‌ పర్‌చేజ్‌ ప్రైస్‌ అడ్జస్ట్‌మెంట్‌ (ఎఫ్‌పీపీపీఏ) రూపంలో పెంచింది.  ప్రస్తుతం యూనిట్‌ ధర వివిధ వర్గాల వాడకానికి అనుగుణంగా యూనిట్‌కు రూ.2.50 నుంచి రూ. 7.50 వరకు ఉంది. . ‘‘గుజరాత్‌లో విద్యుత్‌ వినియోగదారులు 2021 మే–జూన్‌లో యూనిట్‌కి రూ.1.80 చెల్లిస్తే, ఈ ఏడాది జూన్‌ నాటికి యూనిట్‌ ధర రూ.2.50 చెల్లించాల్సి వస్తోంది. అంటే ఏడాదిలో 70 పైసలు పెరిగింది.

గత రెండు నెలల్లోనే యూనిట్‌కు 30 పైసలు పెరిగేసరికి రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులపై నెలకి అదనంగా రూ.270 కోట్ల భారం పడింది’’ అని రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ నిపుణుడు కె.కె.బజాజ్‌ చెప్పారు. గుజరాత్‌లో విద్యుత్‌ వాడకం ఎక్కువ. ఒక వ్యక్తి ఏడాదికి సగటున 2,150 యూనిట్లు వాడితే, ఇతర రాష్ట్రాల్లో 1,150 యూనిట్లే వాడతారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో డిమాండ్‌కి తగ్గట్టుగా సరఫరా కోసం విద్యుత్‌ కంపెనీలు రూ.20 పెట్టి యూనిట్‌ కొనుక్కోవాల్సి వస్తోంది. ఫలితంగా విద్యుత్‌ చార్జీలు వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపాయి. పారిశ్రామిక రంగానికి యూనిట్‌కు రూ.7.50 చెల్లించాల్సి రావడంతో వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించకపోతే వ్యాపారాలు చేయలేమంటోంది సదరన్‌ గుజరాత్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ. మహారాష్ట్ర, తెలంగాణలో పరిశ్రమలు యూనిట్‌కు రూ.4 చెల్లిస్తే, తాము రూ.7.50 చెల్లించాల్సి వస్తోందన్న ఆందోళనలో వారు ఉన్నారు.  
 
ఆప్‌ వర్సెస్‌ బీజేపీ
గుజరాత్‌లో మొదటిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌ తరహాలో గృహాలకు నెలకి 300 యూనిట్‌ల వరకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ హామీ పట్ల సామాన్యులు ఆకర్షితులవుతున్నారు. 2021 డిసెంబర్‌ 31కి ముందు జారీ అయిన పెండింగ్‌ విద్యుత్‌ బకాయిల్ని మాఫీ చేస్తామని, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించింది. .మరోవైపు కాంగ్రెస్‌ కూడా ఉచిత విద్యుత్‌ హామీని అమలు చేస్తామంటోంది. ఇవన్నీ  అధికార పార్టీకి సవాల్‌గా మారాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచితాలు ఇచ్చే పార్టీల మాయలో పడొద్దని ఉచిత హామీ పథకాలు దేశాభివృద్ధిని అడ్డుకుంటాయంటూ ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉచిత విద్యుత్‌ హామీ నెరవేరాలంటే గుజరాత్‌ ఖజానాపై ఏడాదికి రూ.8,700 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఏ ప్రభుత్వమైనా ఇంత అదనపు భారాన్ని ఎలా మోస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్‌ అందించడంమే తమ పార్టీ లక్ష్యమనం మోదీ అంటున్నారు. విద్యుత్‌ చౌర్యం జరగకుండా మీటర్లు పెట్టడం తప్పనిసరి చేశారు. మరోవైపు బీజేపీ ప్రచారాన్ని ఆప్‌ తిప్పి కొడుతోంది. గుజరాత్‌లో ముఖ్యమంత్రి నెలకి 5 వేల యూనిట్లు, ఇతర మంత్రులకి 4 వేల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నప్పుడు సాధారణ జనం 300 యూనిట్ల వరకు ఎందుకు వాడుకోకూడదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉచిత విద్యుత్‌ గుజరాత్‌ ఓటర్లకు కొత్త కాదు. 2012 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేశూభాయ్‌ పటేల్‌ ఉచిత విద్యుత్‌ హామీ ఇచ్చారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించిన కేశూభాయ్‌ పటేల్‌ రైతులకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రకటించారు. ఆ పథకం కింద 47 లక్షల ముంది లబ్ధి పొందుతారు. అయితే మోదీ ఛరిష్మాకు ఆయన ఎదురు నిలువ లేకపోయారు.అప్పట్లో ఉచిత విద్యుత్‌ హామీలేవీ ఫలించలేదు. ఇప్పుడు కూడా ఆప్, కాంగ్రెస్‌కు అదే జరుగుతుందని బీజేపీ ధీమాగా ఉంది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు