Gujarat Assembly Elections 2022: సోషల్‌ శరణం గచ్ఛామి! ఏ పార్టీ ప్రచారంలో ముందుంది అంటే?

28 Nov, 2022 05:28 IST|Sakshi

గుజరాత్‌ ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. ర్యాలీలు, రోడ్‌ షోలు, బహిరంగ సభలతో ప్రధాని మోదీ,  ఆప్‌ నేత కేజ్రీవాల్‌ ప్రచారంలో దూసుకుపోతూంటే కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ గాంధీ మాత్రం ఒక్క రోజు ప్రచారంతో సరిపెట్టారు. మరోవైపు మూడు పార్టీలు డిజిటల్‌ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. సోషల్‌ మీడియా ప్రచారానికి తొలుత శ్రీకారం చుట్టిన బీజేపీ ఈ ప్రచారంలోనూ తానే ముందుంది.

కాంగ్రెస్‌ పార్టీ కాలేజీ విద్యార్థులనే సోషల్‌ మీడియా ప్రచారంలో భాగస్వామ్యుల్ని చేసింది. కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబానికి చెందిన వారెవరూ  ప్రచారానికి రాకపోవడంతో ఆ లోటు పూరించేలా క్షేత్ర స్థాయిలో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి ఓటర్లకు దగ్గరయ్యే ప్రయ త్నం చేస్తోంది. ఇక ఆప్‌ సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడం దగ్గర్నుంచి ప్రచారం దాకా సోషల్‌ మీడియా మీదే ఆధారపడింది.      

కాంగ్రెస్‌
► వాట్సాప్‌ ద్వారా బాగా ప్రచారం చేస్తోంది. 27 ఏళ్లుగా బీజేపీ ఏమేం చెయ్యలేదో , తమ హయాంలో ఏం చేశామో చెబుతోంది.
► అసెంబ్లీ స్థానాల వారీగా ఫేస్‌బుక్‌ పేజీలు  ఏర్పాటు చేసి సమస్యలపై, తాము చేయబోయే పరిష్కారంపై ప్రచారం చేస్తోంది.
► 50 వేల వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసింది.
► ఠాకూర్లు, పటీదార్లు, ఆదివాసీలు ఇలా.. కులాలు, వర్గాల వారీగా కూడా వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.
► కాంగ్రెస్‌ పార్టీకి ఫేస్‌బుక్‌లో 7 లక్షల మందికి పైగా ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 64 లక్షలు, ట్విటర్‌లో 2 లక్షలు, యూ ట్యూబ్‌లో 9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.  
► కొన్ని టెక్కీ సంస్థల్ని అద్దెకు తీసుకొని ప్రచారానికి అవసరమైన కంటెంట్‌ తయారు చేస్తోంది.
► పార్టీలో అధికారులు కాకుండా, క్షేత్ర స్థాయిలో 10 వేల నుంచి 12 వేల మంది వాలంటీర్లు పని చేస్తున్నారు.
 

ఆప్‌  
► ఢిల్లీ మోడల్, మేనిఫెస్టో హామీలు ఓటర్లకు చేరేలా వాట్సాప్‌ను అధికంగా వినియోగిస్తోంది.  
► ఆప్‌కు ఫేస్‌బుక్‌లో 6 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. నేషనల్‌ యూ ట్యూబ్‌లోనూ ప్రచారం చేస్తోంది. దీనికి 43 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
► ఆప్‌ సోషల్‌ మీడియా ప్రచార బాధ్యతల్ని 25 మంది యువ ఇంజనీర్లు తమ భజస్కంధాల మీద మోస్తున్నారు. 20 వేలమంది సోషల్‌ మీడియా వారియర్లను కూడా నియమించింది.  
► ఆప్‌ మద్దతుదారుల ద్వారా కూడా అన్ని యాప్‌లలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.  
► ప్రతీ గ్రామానికి ఒక వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టి ప్రచారం నిర్వహిస్తోంది.  
► సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గధ్వీ ఎంపిక కూడా సోషల్‌ మీడియా ఓటింగ్‌ ద్వారా నిర్వహించి కొత్త ట్రెండ్‌ సృష్టించింది.   

బీజేపీ
► గుజరాత్‌ ఆత్మ గౌరవ ప్రచారానికి ప్రాధాన్యమిస్తోంది. 15 యాప్‌లు వినియోగిస్తోంది.  
► సోషల్‌ మీడియాలో ఆర్నెల్లుగా వారానికో హ్యాష్‌ ట్యాగ్‌తో ప్రచారం చేస్తోంది.  
► మోదీ 20 ఏళ్ల పాలన, వందే భారత్,  ఈ గుజరాత్‌ నేనే నిర్మించాను వంటి ట్యాగ్‌ లైన్‌లతో విస్తృతంగా ప్రచారం.
► సోషల్‌ మీడియా ప్రచారానికి ఎక్కువగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ వినియోగిస్తోంది.
► బీజేపీకి ఫేస్‌బుక్‌లో 35 లక్షల పైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 58 లక్షలు, ట్విటర్‌లో 15 లక్షలు, యూ ట్యూబ్‌లో 50 వేల ఫాలోవర్లున్నారు.
► 20 వేల మంది వర్కర్లు, 60 వేల మంది వాలంటీర్లు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
► బీజేపీ డిజిటిల్‌ వార్‌ రూమ్‌లో కంటెంట్‌ ఇస్తున్న వారంతా 20 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న యువ టెక్కీలే.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు