మూడు ముక్కలాట.. బీజేపీ, ఆప్, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోటీ

1 Dec, 2022 05:14 IST|Sakshi

అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం జరగనున్న పోలింగ్‌కు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సౌరాష్ట్ర,, కచ్, దక్షిణ గుజరాత్‌ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ హోరాహోరిగా ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్‌ పార్టీ నిశ్శబ్ధ ప్రచారం అంటూ క్షేత్ర స్థాయిలో నాయకులు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

ఎవరి వ్యూహాలు వారివే  
27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో బీజేపీని మరోసారి గెలిపించే బాధ్యతను తానే స్వయంగా తీసుకున్నారు. మోదీ ఇమేజ్, అభివృద్ధి, గుజరాత్‌ ఆత్మగౌరవం అంశాలనే బీజేపీ నమ్ముకుంది. ఎన్నికలకు ముందు మోదీ రూ.29 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. మొత్తం 43 మంది సిట్టింగ్‌లకు టిక్కెట్‌లు నిరాకరించడంతో పాటు ఎన్నికలకు ముందు సీఎం సహా మొత్తం కేబినెట్‌ను మార్చేసి కొత్త రూపుతో అధికార వ్యతిరేకతను ఎదుర్కోవడానికి బీజేపీ వ్యూహాలు పన్నింది.

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో ఉండడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోట్‌లో ప్రచారాన్ని నడిపించారు. గత ఎన్నికల్లో సౌరాష్ట్ర, కచ్‌లలో పట్టు సాధించిన స్థానాలపై దృష్టి పెట్టారు. క్షత్రియులు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సామాజిక వర్గాల ఓట్లను కొల్లగొట్టడానికి రూపొందించిన ఖామ్‌ వ్యూహంపైనే ఆశలు పెట్టుకుంది. ఇక చాప కింద నీరులా విస్తరిస్తున్న ఆప్‌ పట్టణాల్లో బీజేపీ, పల్లెల్లో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకి గురిపెట్టింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికే వ్యూహాలు పన్నుతూ ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రచారాన్ని అంతా తానై నడిపించారు. ఉచిత కరెంట్, ఢిల్లీ మోడల్‌ పాలన ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా ఉంది.  

ఏ ప్రాంతంలో ఎవరి హవా !
2017 ఎన్నికల్లో  89 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్‌ 40 సీట్లలో గెలుపొందింది. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా బలం పుంజుకోవడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్‌ పార్టీలతో పాటుగా, భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) కూడా పోటీ చేస్తున్నాయి.  గత ఎన్నికల్లో సౌరాష్ట్ర, కచ్‌లలో బీజేపీ వెనుకబడి పోయింది. పటీదార్ల ఉద్యమంతో ఈ ప్రాంతంలోని ప్రాబల్యమున్న లెవా పటేళ్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపించారు. ఈ ఐదేళ్లలో మళ్లీ బీజేపీ వైపు మళ్లిపోయారు. ఈ ప్రాంతానికి చెందిన మల్దారీలు అందరూ ఈ సారి ఆప్‌కి అండగా ఉన్నారు.అధికార బీజేపీ ప్రతిపాదించిన పశువుల నియంత్రణ బిల్లును మల్దారీలు తీవ్రగా వ్యతిరేకించారు. ఆప్‌ పశు సంరక్షణ కోసం రోజుకి రూ.40 ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆ వర్గం ఆప్‌ వైపే చూస్తోంది. సౌరాష్ట్రలో బీజేపీకి పట్టున్న రాజ్‌కోట్, భావ్‌నగర్‌ పట్టణ కేంద్రాలపై ఆప్‌ దృష్టి సారించింది. దక్షిణ గుజరాత్‌లో పటీదార్లతో పాటు మరాఠీలు, ఆదివాసీల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఆరెస్సెస్, క్రిస్టియన్‌ మిషనరీ సంస్థలు క్రియాశీలకంగా ఉండడం బీజేపీకి, కాంగ్రెస్‌ కలిసొచ్చే అంశం.

బరిలో 788 మంది
తొలి దశ ఎన్నికల్లో మొత్తం 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.బీజేపీ, కాంగ్రెస్‌ మొత్తం 89 స్థానాల్లో పోటీ పడుతూ ఉంటే, ఆప్‌ 88 స్థానాల్లో పోటీ చేస్తోంది.. తూర్పు సూరత్‌ నియోజకవర్గం అభ్యర్థి ఆఖరి నిమిషంలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆప్‌ 88 స్థానాలకే పరిమితమవాల్సి వచ్చింది.  ఆప్‌ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గధ్వీ ద్వారక జిల్లాలోకి కంభాలియా నుంచి పోటీ పడుతూ ఉంటే ఆప్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా సూరత్‌లోని కటాగ్రామ్‌ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశ పోటీలో ఉన్న ముఖ్యుల్లో క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రవీబా జడేజా జామ్‌నగర్‌ (ఉత్తరం) నుంచి బరిలో ఉన్నారు.   

పోలింగ్‌ జరగనున్న నియోజకవర్గాలు 89
పోటీ పడుతున్న అభ్యర్థులు    788
మహిళా అభ్యర్థులు    70
స్వతంత్ర అభ్యర్థులు    339
ఓటర్ల సంఖ్య     2 కోట్లు
పోలింగ్‌ కేంద్రాలు     14,32 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు