Gujarat Assembly Elections 2022: ముగిసిన రెండో దశ పోలింగ్‌.. 60శాతానికిపైగా ఓటింగ్!

5 Dec, 2022 17:07 IST|Sakshi

అప్‌డేట్స్‌

ముగిసిన రెండో దశ పోలింగ్‌.. 60శాతానికిపైగా ఓటింగ్
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. తుది విడతలో 60 శాతానికిపైగా ఓటింగ్‌ నమోదైనట్లు అంచనా. రెండు దశల్లో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 8న జరగనుంది. 

04:00PM
మధ్యాహ్నం 3 గంటల వరకు 50.51 శాతం ఓటింగ్‌
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 50.51 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సబర్‌కాంతా జిల్లాలో అత్యధికంగా 57.24 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు పేర్కొంది. 

ఓటేసిన ప్రధాని మోదీ తల్లి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 100 ఏళ్ల హీరాబెన్‌ గాంధీనగర్‌లోని రాయ్‌సన్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. 

01: 55PM
మధ్యాహ్నం 1 గంట వరకు 34.74 శాతం ఓటింగ్‌
గుజరాత్‌ శాసనసభ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 34.74 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మాజీ టీమిండియా క్రికెటర్‌ నయన్ మోంగియా.. వడోదరలోని పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

12: 15PM
ఉదయం 11 గంటల వరకు 19.17 శాతం ఓటింగ్‌
గుజరాత్‌ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.17 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

10: 30AM
ఉదయం 9 గంటల వరకు 4.75 శాతం ఓటింగ్‌
గుజరాత్‌ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 4.75 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. గాంధీనగర్‌లో అత్యధికంగా 7 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు పేర్కొంది. 
ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్‌, అహ్మదాబాద్‌లోని శిలాజ్‌ అనుపమ్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ 95లో ఓటు వేశారు. 

09: 23AM
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ


 

08:56AM

  • ప్రధాని నరేంద్ర మోదీ,  అమిత్‌ షాలు ఓటేయడానికి పోలింగ్‌ స్టేషన్‌కు బయల్దేరారు. 
  • రానిప్‌లోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌ బూత్‌లో మోదీకి ఓటు..
  • గాంధీనగర్‌ నుంచి రానిప్‌కు బయల్దేరిన మోదీ

08:50AM
కొనసాగుతున్న పోలింగ్‌

08:00AM

  • గుజరాత్‌ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం
  • మధ్య గుజరాత్‌లో బీజేపీ పట్టు కొనసాగుతున్నప్పటికీ ఆప్‌ నుంచి సవాళ్లు
  • ఉత్తర గుజరాత్‌లో ఆప్‌ ఉనికి లేకపోయినప్పటికీ అధికార పార్టీకి ఎదురుగాలి

అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి:  ప్రధాని మోదీ

గుజరాత్‌ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. తన ట్విటర్‌ ఖాతా ద్వారా ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని. 

14 జిల్లాల్లో 93 స్థానాలకు
మధ్య, ఉత్తర గుజరాత్‌ల్లోని 14 జిల్లాల్లో 93 స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. 833 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ, ఆప్‌ మొత్తం 93 స్థానాల్లో, కాంగ్రెస్‌ 90 చోట్ల, దాని మిత్రపక్షం ఎన్సీపీ మూడు స్థానాల్లో పోటీ పడుతున్నాయి. 255 మంది స్వతంత్రులూ బరిలో ఉన్నారు. 2.54 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 14,975 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు.

బరిలో ఉద్యమకారులు  
ఈ దఫా ఎన్నికల్లో కొన్ని హాట్‌ సీట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పటీదార్‌ ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్, ఠాకూర్ల ఆందోళనల నేత అల్పేశ్‌ ఠాకూర్‌ బీజేపీ తరఫున, దళిత సమస్యలపై గళమెత్తిన జిగ్నేష్‌ మేవానీ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఘాట్‌లోడియా స్థానం నుంచి పోటీ పడుతూ ఉంటే,  కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన హార్దిక్‌ పటేల్‌ వీరమ్‌గామ్‌ అల్పేష్‌ కుమార్‌ గాంధీనగర్‌–సౌత్‌ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక జిగ్నేష్‌ మేవానీ వద్గమ్‌ నుంచి మరోసారి పోటీకి దిగారు. బీజేపీకి కనీసం నాలుగైదు స్థానాల్లో రెబెల్‌ అభ్యర్థులు సవాల్‌ విసురుతున్నారు. వఘోడియా, పాద్రా, బయాద్, నాందోడ్‌లలో రెబెల్స్‌ పార్టీకి తలనొప్పిగా మారారు.  

16 ముస్లిం ప్రాబల్యం స్థానాలు కీలకం
అహ్మదాబాద్‌లోని ముస్లింల ప్రాబల్యం ఉన్న 16 స్థానాలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. వీటిలో నాలుగు స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థుల్ని నిలబెట్టడంతో చతుర్ముఖ పోటీ నెలకొంది. గుజరాత్‌ మతఘర్షణలో అత్యాచార బాధితురాలు బిల్కిస్‌ బానో దోషుల్ని శిక్షాకాలం కాక ముందే విడుదల చేయడం కూడా అధికార పార్టీకి మైనస్‌గా మారింది. దీంతో ఓట్లు చీలిపోయి ఎవరికి లబ్ధి చేకూరుతుందా అన్న ఆందోళన కమలనాథుల్లో ఉంది. గుజరాత్‌ మోడల్‌ పాలనతో అత్యధిక ప్రయోజనం పొందిన అహ్మదాబాద్‌ దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అహ్మదాబాద్‌ జిల్లాలో అయిదు స్థానాలు దక్కించుకోవడం, పట్టణ ప్రాంతాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ బలపడడం బీజేపీకి సవాల్‌గా మారాయి. అందుకే ప్రచారంలో ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో వరసగా రెండు రోడ్‌ షోలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.  

ఓటుపై ఉదాసీనత
డిసెంబర్‌ 1న జరిగిన తొలి దశ పోలింగ్‌లో ఓటు వెయ్యడానికి ప్రజల్లో ఒక రకమైన ఉదాసీనత కనిపించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్‌లలో ఓటింగ్‌ అత్యంత స్వల్పంగా జరిగింది. మొత్తమ్మీద 63.3% పోలింగ్‌ నమోదైంది. పట్టణాలకు, గ్రామాలకి మధ్య పోలింగ్‌లో 35% వరకు తేడా ఉంది. అహ్మాదాబాద్, ఆనంద్, వడోదరా, గాంధీనగర్, గోధ్రా వంటి నగరాల్లో రెండో దశ పోలింగ్‌ ఉండడంతో ఓటర్లు ఉదాసీనంగా వ్యవహరించవద్దని, తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఓటర్లందరూ ముందుకు రావాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సోమవారం అహ్మాదాబాద్‌లో ఓటు వేయనున్నారు.

మరిన్ని వార్తలు