Gujarat Assembly Elections 2022: ప్రతి బూత్‌ బీజేపీదే కావాలి

21 Nov, 2022 05:31 IST|Sakshi

గుజరాత్‌లో విజయంపై ప్రధాని మోదీ

వెరవాల్‌/ధొరాజి: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ బీజేపీకే విజయం అందించాలని గుజరాత్‌ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. ఎన్నికల రోజు ఓటర్లంతా భారీగా పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చి, గత రికార్డులను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. ‘బీజేపీకే ఓటేయాలని మిమ్మల్ని అడగడం లేదు. ప్రతి పౌరుడూ ఈ ప్రజాస్వామ్య వేడుకలో భాగస్వామిగా మారాలి’అని కోరారు. ‘తరచూ వచ్చే కరువు పరిస్థితులు వంటి కారణాలతో గతంలో రాష్ట్రాన్ని అందరూ చిన్నచూపు చూసేవారు. కానీ, అభివృద్ధిమార్గంలో పయనిస్తోంది. యావత్తు ఉత్తరభారతం నుంచి ఉత్పత్తులు రాష్ట్రంలోని రేవుల నుంచే ప్రపంచదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

దేశ సౌభాగ్యానికి ఈ ఓడరేవులే ద్వారాలుగా మారాయి’అని ప్రధాని చెప్పారు. నర్మదా బచావో ఆందోళన్‌ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ శనివారం మహారాష్ట్రలో జరుగుతున్న భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడవడంపై ఆయన స్పందించారు. సౌరాష్ట్రకు జలాలను అందించే నర్మదా డ్యామ్‌ ప్రాజెక్టును 3 దశాబ్దాలపాటు అడ్డుకున్న వారితో అంటకాగుతున్న కాంగ్రెస్‌కు ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్‌ నేతలను నిలదీయాలని మోదీ ప్రజలను కోరారు. కాంగ్రెస్‌కు వేసిన ఓటు వృధాయే అన్నారు. గిర్‌ సోమ్‌నాథ్, రాజ్‌కోట్‌ జిల్లాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని ప్రసంగించారు. అంతకుముందు ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయంలో పూజలు చేశారు. రాష్ట్రంలో డిసెంబర్‌ 1, 5వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు