ఆ పార్టీ మునిగిపోయే నావ: గుజరాత్‌ సీఎం

10 Nov, 2020 16:59 IST|Sakshi

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విద్వేషపూరిత రాజకీయాలు, ఎత్తుగడలను ఓటర్లు చిత్తు చేశారంటూ గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు రాబోయే ఎన్నికలకు ట్రైలర్‌ వంటివని, అప్పుడు కూడా విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో 8 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిలో జయకేతనం ఎగురవేసిన కాషాయ పార్టీ.. మరో 5 స్థానాల్లోనూ క్లీన్‌స్వీప్‌ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సీఎం విజయ్‌ రూపానీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘కాంగ్రెస్‌ మునిగిపోతున్న నావ.. ఆ పార్టీ నాయకులు ప్రజలకు ఎప్పుడో దూరమయ్యారు. ప్రతిచోటా వారికి వ్యతిరేకంగానే ఫలితాలు వెలువడుతున్నాయి. అధినాయకత్వ లోపం కనబడుతోంది. ఈ ఉప​ఎన్నికల ఫలితాలు రాబోయే స్థానిక ఎన్నికలకు ట్రైలర్‌ వంటివి’’ అని పేర్కొన్నారు. (చదవండి: బిహార్‌ ఫలితాలు : కాషాయ శ్రేణుల్లో కోలాహలం)

ఇక రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. అబ్డాసా, మోర్బీ, కర్జన్‌ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. డాంగ్స్‌, ధరి, గధాడా, కప్రాడా, లింబ్డీ నియోజకవర్గాల్లోనూ స్పష్టమైన ఆధిక్యం సాధించి విజయం దిశగా దూసుకుపోతోంది. కాగా మధ్యప్రదేశ్‌తో పాటు గుజరాత్‌లో 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 7, మణిపూర్‌లో 4, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 2, నాగాలాండ్‌లో 2, ఒడిశాలో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, హర్యానాలో 1 స్థానానికి ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అన్ని చోట్లా విపక్షాలను చిత్తు చేస్తూ బీజేపీ విజయం దిశగా పయనిస్తూ సత్తా చాటుతోంది.

మరిన్ని వార్తలు