వేదికపై కుప్పకూలిన సీఎం, పీఎం ఆరా

15 Feb, 2021 08:42 IST|Sakshi

సాక్షి,వడోదర: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (64) వేదికపై హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సందర్భంలో అస్వస్థతకు గురైన ఆయన స్టేజ్‌పైనే పడిపోయారు. దీంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు.  ప్రథమ చిక్సిత అనంతరం అహ్మదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఇతర బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు. వడోదరలోని నిజాంపురలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూపానీ ఆరోగ్యంపై ఆరా తీసారు.  (గుజరాత్‌ సీఎంకు కరోనా)

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్థానికబీజేపీ నాయకులు వెల్లడించారు. వడోదరలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా సీఎంకు కళ్లు తిరిగాయనీ దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పడిపోకుండా పట్టుకున్నారనీ బీజేపీ నేత భరత్‌ తెలిపారు. అనంతరం ఆయనను వడోదర నుంచి అహ్మదాబాద్‌కు హెలికాప్టర్‌లో తరలించామన్నారు. కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంతో రెండు రోజులుగా సీఎం ఆరోగ్యం దెబ్బతిందన్నారు. లో బీపీ, రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో నీరిసించి పోయారని వైద్యులు తెలిపారని చెప్పారు. కాగా గుజరాత్‌లోని వడోదరతో సహా కీలకమైన ఆరుమునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న ఎన్నికలు జరగనున్నాయి.  మునిసి పాలిటీలు, జిల్లాలు, తాలూకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరుగుతాయి.

మరిన్ని వార్తలు