Vijay Rupani Resigns: కొత్త సీఎం రేసులో ఉన్నది వీరే

11 Sep, 2021 16:38 IST|Sakshi

గాంధీనగర్‌: మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గుజరాత్‌ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ శనివారం రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్‌ని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. మోదీ నాయకత్వంలో గుజరాత్‌ అభివృద్ధి కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

అయితే అనారోగ్య కారణాలతోనే విజయ్‌ రూపానీ రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే గుజరాత్‌లో బలమైన పటేల్‌ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకే రూపానీతో రాజీనామా చేయించినట్టు తెలుస్తోంది. 

గత ఎన్నికల సమయంలో పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన హార్ధిక్‌ పటేల్‌ బీజేపీని బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. తమ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆయన భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ, పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చితే రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయి. దీంతో అధికార బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది. 

15 శాతం జనాభా.. మద్దతు లేకుంటే కష్టమే..
గుజరాత్‌లో అధికార బీజేపీకి పటేళ్లు గట్టి మద్దతుదార్లు. ఆ రాష్ట్ర జనాభాలో ఈ సామాజికవర్గం వారు 15 శాతం మంది ఉన్నారు. గుజరాత్లో రాజకీయ, వ్యాపార రంగాల్లో పటేల్ సామాజికవర్గం వారు కీలక స్థాయిలో ఉన్నారు. ఈ క్రమంలోనే పటేళ్లకు మరింత ప్రాధాన్యం కల్పించి.. వారికి దగ్గరవ్వాలని బీజేపీ చూస్తోంది. ఇక రూపానీ రాజీనామాతో ఖాళీ అయిన సీఎం పీఠాన్ని ఎవరికి కట్టబెడతారనే చర్చ ఊపందుకుంది. కొత్త ముఖ్యమంత్రి రేసులో నితిన్‌ పటేల్‌, సీఆర్‌ పటేల్‌, ఆర్‌సీ ఫాల్దూ, మన్సుఖ్‌ మాండవియా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 

చదవండి: 
గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ రాజీనామా 

మ‌మ‌తా బెన‌ర్జీపై పోటీకి ప్రియాంకా

మరిన్ని వార్తలు