గుజరాత్‌ ‘చేతికి’ చిక్కేనా?

16 Nov, 2022 03:39 IST|Sakshi

ఒకప్పుడు గుజరాత్‌ కాంగ్రెస్‌కు కంచుకోట. నరేంద్ర మోదీ గుజరాత్‌ పగ్గాలు చేపట్టాక అదంతా గత వైభవంగా మారిపోయింది. గత 27 ఏళ్లుగా అధికారం కోసం పోరాటం చేస్తోంది. మరి ఈ సారైనా కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేజిక్కించుకోగలదా ? అంతర్గత సమస్యల్ని దాటుకొని మోదీ సొంత గడ్డపై విజయకేతనం ఎగురవేయగలదా ?  

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు రెండే రెండు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికారం దక్కాలంటే వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. గుజరాత్‌లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ఉన్న వ్యతిరేకత కలిసివస్తుందని భావిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడైన మల్లిఖార్జున ఖర్గే ఈ ఎన్నికల్ని ఒక సవాల్‌గా తీసుకున్నారు.

మొత్తం 182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీలో 2002 నుంచి బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ సీట్లు తగ్గుతూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు సాధిస్తే, కాంగ్రెస్‌ 77 సీట్లలో గెలిచింది. 2012 ఎన్నికలతో పోల్చి చూస్తే 16 స్థానాల బలాన్ని పెంచుకుంది.  ఎక్కువ స్థానాలను స్వల్ప మెజార్టీతోనే పోగొట్టుకుంది. అందుకే ఈ సారి విజయం తమదేనని గట్టిగా విశ్వసిస్తోంది. బీజేపీ, ఆప్‌లు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ క్షేత్రస్థాయిలో బలంగా ప్రచారం నిర్వహిస్తోంది. 125 ప్లస్‌ లక్ష్యంగా కేంద్ర మాజీ మంత్రులు, ఇతర రాష్ట్రాల్లో కీలక నేతలు బూత్‌ స్థాయి లో ప్రచారం చేస్తున్నారు.    

ఆప్‌ ప్రభావం  
ఆప్‌ తొలిసారిగా బరిలో దిగడంతో ముక్కోణపు పోటీ నెలకొంది. ఆప్‌ ఏ పార్టీ విజయావకాశాలను దెబ్బ తీస్తుందన్నది అంతుచిక్కడం లేదు. ఆప్‌ పట్టణ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేసి బీజేపీ ఓటు బ్యాంకునే కొల్లగొడుతుందన్నది కాంగ్రెస్‌ ధీమా. దిగ్గజ నేత అహ్మద్‌ పటేల్‌ లేకుండా ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కావడం, పీసీసీ అధ్యక్షుడు జగదీశ్‌ ఠాకూర్‌ ఇతర నేతల్ని కలుపుకొని పోతూ ఎంతవరకు పనిచేయగలరన్న సందేహాలైతే ఉన్నాయి.  

అనుకూలం 
బీజేపీ 27 ఏళ్ల పాటు అధికారంలో ఉండడంతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత 

► కాంగ్రెస్‌కి సంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంకు ఠాకూర్, కొలి వంటి ఓబీసీలు, ఖామ్‌ ఓటర్ల (క్షత్రియ, హరిజన, ఆదివాసీ, ముస్లిం) అండదండలు  

► ఆరు దఫాలుగా బీజేపీ చేతిలో ఓడిపోతున్నా కాంగ్రెస్‌ 40% ఓటు షేర్‌ సాధించడం  

► గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కున్న పట్టు ఇంకా కొనసాగుతుండటం

ప్రతికూలం 
 రాష్ట్రస్థాయిలో బలమైన నేతల కొరత, పార్టీలో అంతర్గత పోరు 

► గత 30 ఏళ్లలో 60 అర్బన్, సెమీ అర్బన్‌ సీట్లలో ఒక్కదాంట్లోనూ నెగ్గలేకపోవడం 

► రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రపైనే కేంద్ర నాయకత్వం దృష్టి సారించడం  

► 2017–2022 మధ్య కాలంలో హార్ధిక్‌ పటేల్‌ సహా 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరడం   

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

మరిన్ని వార్తలు