గుజరాత్ ఎన్నికలకు ముందు బీజేపీ షాకింగ్ నిర్ణయం.. ఏడుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు

20 Nov, 2022 16:32 IST|Sakshi

గాంధీనగర్‌: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన వీరంతా టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో క్రమశిక్షణా రాహిత్యం కింద పార్టీ కఠిన చర్యలు తీసుకుంది.

సస్పెండ్ అయిన ఏడుగురు ఎమ్మెల్యేలు.. హర్షద్ వాసవ, అరవింద్ లదాని, ఛత్రాసింగ్ గుంజారియా, కేతన్ భాయ్ పటేల్, భరత్ భాయ్ చావ్‌డా, ఉదయ్‌ భాయ్ షా, కరన్ భాయ్ బరైయా. వీరంతా డిసెంబర్ 1న జరిగే తొలి విడత ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపింది బీజేపీ. మొత్తం 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది.  మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు కూటా టికెట్ ఇవ్వలేదు.

మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా ఏడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, పూర్వవైభవం సాధించి మరోసారి గుజరాత్‌ను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నాయి.
చదవండి: ఉద్ధవ్ శివసేన కార్యాలయం కూల్చివేత..ముంబైలో ఉద్రిక్తత..

మరిన్ని వార్తలు