Gujarat Elections 2022: కాంగ్రెస్‌కు షాక్‌.. బీజేపీలోకి ఇద్దరు కీలక నేతలు!

3 Aug, 2022 15:28 IST|Sakshi

గాంధీనగర్‌: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఇద్దరు ప్రముఖ నేతలు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం చర్యలతో నిరాశకు లోనయ్యామని, తాము సంతోషంగా లేమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండా నచ్చి వచ్చే నెలలో బీజేపీ తీర్థ పుచ్చుకోనున్నట్లు స్పష్టం చేశారు. 

విజయ్‌పుర్‌ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి నరేశ్‌ రావల్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. ‘పార్టీతో నాకు చాలా సమస్యలు ఉన్నాయి. అయితే వాటి గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదు. కానీ, పార్టీకి జైహింద్‌ చెప్పాలని నిర్ణయించుకున్నా. త్వరలోనే బీజేపీలో చేరతాను. పార్టీ నాయకత్వం ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా నిర్వర్తిస్తాం.’ అని పేర్కొన్నారు.

మరోవైపు.. ఇలాంటి ప్రకటనే చేశారు కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ రాజు పార్మర్‌. ‘గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నాను. పార్టీపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. కానీ, దురదృష్టవశాత్తు అధిష్టానం కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వటం ప్రారంభించింది. నేనెప్పుడూ ఏ పదవులు కోరలేదు. కొద్ది రోజుల్లో చాలా మంది సీనియర్లు పార్టీని వీడతారు.’ అని తెలిపారు. ‘ఇరువురు నేతలు పార్టీకి సీనియర్లు. నరేశ్‌ రావల్‌ గతంలో ప్రతిపక్ష నేతగా, సహాయ మంత్రిగా చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజు పార్మర్‌ మూడు సార్లు రాజ్యసభకు వెళ్లారు. ఎస్టీ కమిషన్‌కు ఛైర్మన్‌గా చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీతో చర్చించాలి. వారి నిర్ణయం పార్టీకి తీరని నష్టాన్ని మిగుల్చుతుంది.  ’ అని పేర్కొన్నారు పార్టీ సీనియర్‌ నేత అర్జున్‌ మోధ్వాడియా.

ఇదీ చదవండి: మోదీ అడ్డాలో పాగాకు కేజ్రీవాల్‌ పక్కా ప్లాన్‌! 300 యూనిట్ల ఉచిత కరెంటు, బకాయిల రద్దు హామీ

మరిన్ని వార్తలు