ఎంపీల సస్పెన్షన్: సమావేశాలు బహిష్కరణ

22 Sep, 2020 11:00 IST|Sakshi

ఢిల్లీ :  రాజ్యసభలో 8 మంది సభ్యుల పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బాయ్‌కాట్‌ చేస్తున్నామని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ మంగళవారం పేర్కొన్నారు. సభ్యులపై సస్పెన్షన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ , తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యులు కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. 8 మంది సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

వ్యవసాయ బిల్లులపై పునరాలోచించేవరకు సభలోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు.మరోవైపు సభ్యుల సస్పెన్షన్ పై తాను సంతోషంగా లేనని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. ఎంపీల ప్రవర్తన కారణంగానే చర్యలు తీసుకున్నామని.. ఏ సభ్యుడిపై కూడా వ్యతిరేకంగా వ్యవహరించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. (చదవండి : 8 మంది ఎంపీల సస్పెన్షన్‌)

కాగా వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, డెప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌తో అనుచితంగా ప్రవర్తించడం తెల్సిందే. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానంపై డివిజన్‌ ఓటింగ్‌ నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో ఆయన ముఖంపై రూల్‌ బుక్‌ను విసిరేయడం తెలిసిందే. అయితే రాజ్యసభలో ఈ అంశంపై రగడ సోమవారం కూడా కొనసాగింది. దీంతో సభా మర్యాదలకు భంగం కలిగించిన 8 మంది విపక్ష సభ్యులను సోమవారం సస్పెండ్‌ చేశారు.

ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్‌ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రీన్, ఆప్‌ సభ్యులు సంజయ్‌ సింగ్, డోలాసేన్, కాంగ్రెస్‌ ఎంపీలు రాజీవ్‌ సత్వ, సయ్యద్‌ నాజిర్‌ హుస్సేన్, రిపున్‌ బోరా, సీపీఎం సభ్యులు కేకే రాగేశ్, ఎలమారమ్‌ కరీన్‌లను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు, హరివంశ్‌పై విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును చైర్మన్‌ వెంకయ్య నాయుడు తోసిపుచ్చారు. (చదవండి : ఎంపీల నిరసన : ఢిల్లీ పోలీసుల ఓవర్ యాక్షన్)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా