తెలంగాణకు లబ్ధి చేకూర్చేందుకే టీడీపీ డ్రామా: జీవీఎల్‌

18 Jul, 2021 03:01 IST|Sakshi

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు 

చట్టంలోని అంశాల ప్రకారమే గెజిట్‌  

చంద్రబాబు దీనిపై స్పష్టతనివ్వాలి

గుంటూరు మెడికల్‌/సత్తెనపల్లి: తెలంగాణకు లబ్ధి చేకూర్చడం కోసమే టీడీపీ జిల్లాల నేతలు నీటి వివాదంలో మరో వివాదాన్ని సృష్టిస్తున్నారనే అనుమానం కలుగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వెల్లడించారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతల వ్యవహార సరళే దానికి నిదర్శనమన్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. శనివారం గుంటూరు, సత్తెనపల్లిలోని బీజేపీ కార్యాలయాల్లో జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల నీటి గొడవను పరిష్కరించేందుకే కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న అంశాల ప్రకారమే గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

నీటి వివాదంపై టీఆర్‌ఎస్‌ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కేంద్రం సరైన సమయంలోనే నోటిఫికేషన్‌ ఇచ్చిందని, రాష్ట్రాల్లో ప్రాజెక్టులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకుంటాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు, కార్యాచరణ రూపొందించడానికి సోమవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పదివేల రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు జీవీఎల్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు అమలు చేస్తున్న  పథకాలు , సమస్యలపై ఆరు నెలలుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, టుబాకో బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు, మాజీ మంత్రి డాక్టర్‌ శనక్కాయల అరుణ, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు