బీజేపీతో పొత్తు లేకపోతే.. కొన్ని పార్టీలకు భవిష్యత్తే లేదు: జీవీఎల్‌

30 Aug, 2022 04:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: బీజేపీతో పొత్తు లేకుంటే తమకు భవిష్యత్తు లేదని రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు.  విజయవాడలో సోమవారం బీజేపీ పదాధికారుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తుల విషయంలో మీడియాకు, కొన్ని పార్టీలకు గందరగోళం ఉందేమో గానీ తాము మాత్రం స్పష్టమైన విధానంతో సొంతంగా ఎదిగేలా ముందుకు వెళ్తామని చెప్పారు.

ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.  ఫిబ్రవరిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడేవారు నిజాలు తెలుసుకోవాలని, నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

‘వారసత్వ’ పార్టీలతో చేతులు కలపం 
రాష్ట్రంలో కుటుంబ వారసత్వం ఉండే రాజకీయ పార్టీలతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవధర్‌ అన్నారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేనతో మాత్రమే తమకు పొత్తు ఉందని చెప్పారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు సమానదూరం పాటిస్తున్నామన్నారు. 

మరిన్ని వార్తలు