కాలభైరవ స్వామి టెంపుల్‌లో మంత్రి ప్రత్యేక పూజలు

29 Oct, 2020 14:34 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: నాటి నైజం పాలన నుంచి నిన్నటి సమైక్యాంధ్ర పాలన వరకు ప్రతి ఒక్కరు భూమి ఉన్నవారి వద్ద శిస్తు వసూలు చేశారు.. కానీ ఒక్క కేసీఆర్ మాత్రం చరిత్ర తిరగరాసి భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతుబంధు పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గం ఘనపూర్, గుడికందుల గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్ది సోలిపేట సుజాతకు మద్దతుగా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌లు గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడికందుల గ్రామంలోని కాలభైరవ స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉండేదని, కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో రైతుల ఆత్మహత్యలే మిగిలాయని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక రైతుల పరిస్థితి మారిందా లేదా? ప్రజలు ఆలోచించాలన్నారు. రైతుల బతుకుల్లో మార్పు రావాలనే సీఎం కేసీఆర్, 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు ఇస్తున్నారన్నారు. (చదవండి: అప్పుడే బాయి కాడ మీటర్ల జోలికి రారు: హరీశ్‌)

బీజేపీ పాలిస్తున్న 17 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిస్తున్న అయిదు రాష్ట్రాల్లో ఎక్కడైనా 24 గంటల ఉచిత కరెంట్, ఎకరాకు 10 వేలు ఇస్తున్నారా అనేదానికి సమాధానం ఇచ్చి , ఆ తర్వాత వాళ్ళు ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. వచ్చే మూడేళ్లు అధికారంలో ఉండేది తామేనని, అభివృద్ధి తమతోనే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేతిలో నెత్తి లేదు.. కత్తి లేదు.. వాళ్లెం చేస్తరని, ఇక బీజేపీ గోబెల్స్ ప్రచారం తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. వాళ్లు పైసలో.. సీసాలో ఇస్తారు.. లేదంటే హరీశ్ రావును తిడుతరని, వాళ్ల తిట్లకు భయపడను.. దీవెనలుగా తీసుకుంటా.. ఇంకా బలపడతానని అన్నారు. బీజేపీ ఫారిన్ మక్కలు తెచ్చి తెలంగాణ కోళ్లకు పోస్తే.. మన మక్కలు ఎవడు బుక్కాలి? బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందని ప్రశ్నించారు. మార్కెట్లను ప్రైవేటు పరం చేసి రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాదనుకున్న తెలంగాణను, కాదనుకున్న కాళేశ్వరం నీళ్లను తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. బిహార్లో మోదీ డబుల్ ఇంజన్ గ్రోత్ అంటున్నారని, ఇక్కడ కూడా అధికారంలో టీఆర్‌ఎస్‌ ఉన్నదని.. దుబ్బాకలోనూ టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ధి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: హరీశ్‌ వ్యాఖ్యలపై పలు అనుమానాలు: విజయశాంతి)

మరిన్ని వార్తలు