కేంద్రం నిర్ణయాలు దేశానికి ప్రమాదకరం 

21 Sep, 2020 05:39 IST|Sakshi
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

పారగమ్యత పుస్తకావిష్కరణలో మంత్రి హరీశ్‌  

మిరుదొడ్డి (దుబ్బాక): కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, విద్యుత్‌ రంగంపై తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ప్రమాదకరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఆదివారం దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వ్యాసాలతో రూపు దిద్దుకున్న ‘పారగమ్యత’పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతులకు ఇస్తున్న ఉచిత కరెంటుకు మీటర్లు బిగిస్తే రైతులు ఊరుకునే పరిస్థితిలో లేరని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం దేశ రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా 70 లక్షల మెట్రిక్‌ టన్నుల విదేశీ మక్కలను దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చిందన్నారు.

తెలంగాణ రైతుల వద్ద 10 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలను కొని, గోదాముల్లో భద్రపరిచామనీ, వాటినే కొనేవారు లేరని, ఒకవైపు ఇవి మొలకలు వస్తున్నాయని ఆందోళన చెందుతుంటే కేంద్రం విదేశీ మక్కల వ్యవహారం తెరమీదికి తెచ్చిందని మండిపడ్డారు. దేశంలో కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలకమైన బిల్లులు తేవడం సరికాదని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, రసమయి బాలకిషన్, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న, ఆంధ్రప్రదేశ్‌ మీడియా కో–ఆర్డినేటర్‌ వర్దెల్లి వెంకటేశ్వర్లు, సీఎం పీఆర్‌ఓ రమేశ్‌ హజారే, టీయూడబ్ల్యూజే జనరల్‌ సెక్రెటరీ మారుతీ సాగర్, టీఈఎంజేయూ ప్రెసిడెంట్‌ ఇస్మాయిల్, టీఈఎంజేయూ జనరల్‌ సెక్రెటరీ రమణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఢిల్లీ దిమ్మతిరిగేలా తీర్పునిద్దాం 
దుబ్బాకటౌన్‌: ‘ఇప్పుడు దేశమంతా దుబ్బాక వైపు చూస్తున్నది. ఢిల్లీ దిమ్మతిరిగేలా తెలంగాణ ప్రజల మనోగతాన్ని దుబ్బాక ఓటర్లు దేశానికి తెలియజేయాలి’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బావులు, బోర్లకు కరెంటు మీటర్లు పెడతామంటోందని, దీన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ ప్రధాన మంత్రికి లేఖ రాశారని తెలిపారు. ‘చంద్రబాబు మీటర్లు పెడతామంటే ఆయన పని అయిపోయింది. ఇక బీజేపీ మీటర్లు పెడితే వాళ్లూ అడ్రస్‌ లేకుండా పోతారు’అని అన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు