బీజేపీ.. ఐటీ, ఈడీ, సీబీఐని నమ్ముకుంది! 

16 Mar, 2023 03:08 IST|Sakshi

ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి, బురద జల్లుతున్నారు 

బీజేపీ సమాధులు తర్వాతే బీఆర్‌ఎస్‌ పునాదులు వేస్తోంది 

మంచిర్యాల జిల్లా పర్యటనలో మంత్రి హరీశ్‌రావు విమర్శలు  

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/చెన్నూరు: ‘బీజేపీ ప్రజలను కాకుండా ఐటీ, ఈడీ, సీబీఐని నమ్ముకుని గెలవాలని చూస్తోంది. ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి, బురద జల్లి, అబద్ధాలను ప్రచారం చేస్తోంది’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బుధవారం ఆయన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మితో కలసి మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు.

చెన్నూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సభలో మాట్లాడుతూ.. బీజేపీ చేసిన ఒక్క మంచి పని ఉందా? అని ప్రశ్నించారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడం, సంస్థలను అమ్మేయడం చేస్తోందని దుయ్యబట్టారు. ఇక్కడి రెండు బొగ్గు బ్లాక్‌లను వేలం వేసి, సింగరేణిని అమ్మాలని చూస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.

సమాధులు తవ్వే బీజేపీ కావాలో, పునాదులు వేసే బీఆర్‌ఎస్‌ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. అభయహస్తం వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రం నుంచి కరువును తరిమేశారని కొనియాడారు. చెన్నూరు ఎత్తిపోతలతో ఇక్కడి రైతాంగానికి రెండు పంటలకు అవకాశం కలుగుతుందని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు