మోదీ బొమ్మను దాచి ఈటల ప్రచారం

6 Aug, 2021 01:26 IST|Sakshi
కాంగ్రెస్, బీజేపీ నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న హరీశ్‌

బీజేపీకి ఓటేస్తే పెట్రోల్‌ ధర రూ.200 దాటిస్తారు 

మోదీతో కొట్లాడి ఈటల వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలరా..

మంత్రి హరీశ్‌రావు ధ్వజం 

సాక్షి, సిద్దిపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో చూడగానే పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్‌ సిలిండర్ల ధరలు గుర్తుకు వచ్చి ప్రజలు ఓట్లు వేయరనే ఉద్దేశంతో ఈటల రాజేందర్‌ ప్రచార శైలిని మార్చారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. హుజూరాబాద్‌లో మోదీ ఫొటో, బీజేపీ జెండాలను దాచి కేవలం తన ఫొటోతో మాత్రమే ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. బీజేపీ గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమనే విషయం అందరికీ తెలుసన్నారు.

ఆ పార్టీపై విశ్వాసంఉంటే ఈటల వెళ్లి మోదీ దగ్గర వె య్యి కోట్ల ప్యాకేజీ తేగలరా అని ప్రశ్నించారు. ఈటల ఎత్తుగడలకు మోసపోయే పరిస్థితి హుజూరాబాద్‌లో లేదన్నారు. ఇప్పటికే పెట్రోల్‌ ధర రూ.100 దాటిందని, అక్కడ బీజేపీకి ఓటు వేస్తే వ చ్చే ఏడాదిలో డీజిల్, పెట్రోల్‌ ధరలు రూ.200 దాటడం ఖాయ మని, గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,500 దాటుతుందని అన్నారు. 

దళితుల ఓట్లను చీల్చడానికి బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు  
హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అక్కడ వారు చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా మారడం కోసం కాంగ్రెస్‌ అభ్యర్థిగా వేరే నియోజకవర్గానికి చెందిన ఓ దళిత నాయకుడిని రంగంలోకి దింపడానికి ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ అనే వ్యక్తి గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అదే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలిస్తే హుజూరాబాద్‌ ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు