మీ ఓటు రూపాయి బొట్టు బిళ్లకా? ఆసరా పెన్షన్‌కా?

2 Sep, 2021 02:12 IST|Sakshi

ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈటల ఏం చేస్తారు? 

హుజూరాబాద్‌ ప్రజలు ఆలోచించాలి: హరీశ్‌రావు  

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ప్రజల ఓటు రూపాయి బొట్టు బిల్లకా? రూ.2,016 ఆసరా పెన్షన్‌కా? ఎటు వైపో ఆలోచించాలని ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌ రావు అన్నారు. బుధవారం హుజూరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని బోర్నపల్లిలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న పెద్దమ్మ గుడి నిర్మాణానికి, దమ్మక్కపేటలో రూ.కోటి 10 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. దమ్మక్కపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈటల నిర్లక్ష్యం వల్లనే హుజూరాబాద్‌లో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని చెప్పారు. మంత్రిగా ఒక్క ఇల్లు కట్టని ఈటల రాజేందర్, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం పని చేస్తారని ప్రశ్నించారు.

కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చామని, వచ్చే ఏడాది రూ.లక్ష లోపు రైతు రుణాలన్నీ వడ్డీతో సహా మాఫీ చేస్తామని తెలిపారు. తొందర్లోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, యువత చదువుపై శ్రద్ధ చూపి ఉద్యోగాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌చైర్మన్‌ నిర్మల, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్, నాయకులు కౌశిక్‌రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ పత్తి మార్కెట్‌ యార్డులో ఏఐటీయూసీ కార్మిక సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు హరీశ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.  

అమ్మా.. ఓటు ఎవరికేస్తవ్‌ 
బోర్నపల్లిలోని నాగమయ్య గుడి పునరుద్ధరణ పనుల శంకుస్థాపనకు వెళ్తున్న క్రమంలో హరీశ్‌ రావు పొలం పనులకు వెళ్తున్న మహిళా కూలీలను చూసి కారు దిగి వారితో ముచ్చటించారు. ‘అమ్మా.. హుజూరాబాద్‌లో ఓట్లు వచ్చినై కదా? మీరు టీఆర్‌ఎస్‌ వైపా? బీజేపీ వైపా.. ఎటువైపు అనుకుంటాన్లు’అని అడిగారు. కేసీఆర్‌ 24 గంటల కరెంట్‌ ఇస్తండు.. తాము కేసీఆర్‌ కారు గుర్తుకే ఓటేస్తామని ఆ మహిళలు చెప్పారు. దమ్మక్కపేటలో ఓ చిన్నారిని ఎత్తుకొని ఉత్సాహపరిచారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు